అమ్మ మార్కు రాజకీయం
ముఠా తగాదాల ప్రచారాలకు చెక్
అభ్యర్థుల కోసం స్వయంగా ఇంటర్వ్యూలు
వంద మందితో త్వరలో తొలి జాబితా
అన్నాడీఎంకేలో ముఠా తగాదాలు మిన్నంటాయనే ప్రచారాలకు పార్టీ అధినేత్రి జయలలిత చెక్ పెట్టడం ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచడం ద్వారా అమ్మ మార్కు రాజకీయానికి తెరలేపారు.
చెన్నై: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అంటే జనవరి 20వ తేదీ నుంచి అన్నాడీఎంకేలో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తాము ఆశిస్తున్న నియోజకవర్గాలను పేర్కొంటూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పార్టీ అధినేత్రి జయలలిత స్వయంగా ప్రకటించారు. అధికార పార్టీ కావడంతో అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎగిసిపడ్డారు.
తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు 17,698 మంది దరఖాస్తులు సమర్పించారు. ఇవిగాక జయలలిత తమ నియోజకవర్గం నుండి పోటీచేయాలని కోరుతూ 7,936 దరఖాస్తులు అందాయి. అయితే గత ఏడాది 4వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత నుండి పార్టీ కార్యకలాపాల్లో వెనుకబాటుతనం మొదలైంది.
అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఇంటర్వ్యూలు ప్రారంభించగా అన్నాడీఎంకేలో మంత్రులపై వేటు, కార్యకర్తల తొలగింపు, ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని, కుమారుల పెత్తనం అంటూ మంత్రి పన్నీర్‌సెల్వం చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు అన్నాడీఎంకేలోని ఈ పరిస్థితులు ఆయాచిత వరంగా మారాయి.
ఈ దశలో జయలలిత ఏదో మొక్కుబడిగా ఐదుగురిని పోయెస్ గార్డెన్‌కు పిలిపించుకుని ఇంటర్వ్యూలను చేశారు. దీంతో ఆశావహులంతా టిక్కెట్ల కోసం పలువురు మంత్రులను ఆశ్రయించడం ప్రారంభించారు. టిక్కెట్ల కేటాయింపు పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని మరో ప్రచారం ఊపందుకుంది. ఇదే ఆరోపణలపై ఐదుగురు అరెస్ట్ కావడంతో ప్రతిపక్షాల ప్రచారానికి బలం చేకూరింది.
రంగంలోకి దిగిన అమ్మ
ఎన్నికల వేళ అప్రతిష్టపాలైతే దాని ప్రభావం ఫలితాలపై ఉంటుందని అప్రమత్తమైన అమ్మ సోమవారం నేరుగా రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్ నుంచి నివేదికను తెప్పించుకుని ఇంటర్వ్యూలను ప్రారంభించారు. తిరునెల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి, వేలూరు తదితర 25 నియోజకవర్గాలకు పోటీచేయగోరు అభ్యర్థులు రావాల్సిందిగా పార్టీ కార్యాలయం ఆదివారం కబురు పంపింది. సుమారు 50 మంది ఆశావహులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మ వద్దకు చేరుకున్నారు. 1.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమైనాయి. నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున నిర్ణయించి ఒకరు అభ్యర్థి, మరొకరు అభ్యర్థి గెలుపు కోసం పాటుపడాలని అమ్మ ఆదేశించినట్లు తెలుస్తోంది. టిక్కెట్టు లభించలేదని స్వంత పార్టీ అభ్యర్థినే ఓడించేందుకు ప్రయత్నిస్తే పార్టీ పరంగా తీవ్రపరిణామాలు తప్పవని అమ్మ హెచ్చరించినట్లు సమాచారం. అలాగే మంగళవారం నాడు శివగంగై, రామనాథపురం, మధురై, విరుదునగర్, దిండుగల్లు... ఈ ఐదు జిల్లాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీన మిత్రపక్ష పార్టీలకు టిక్కెట్లు ఖరారు చేసి తొలి జాబితాల్లో వంద స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించవచ్చని తెలుస్తోంది.