అమ్మపేరుతో వెలుస్తున్న అనేక పథకాల వరుసలోకి తాజాగా అమ్మ అవార్డు చేరబోతోంది. తమిళభాష ప్రాచుర్యానికి పాటుపడే ప్రతిభావంతులైన మహిళలకు అమ్మ అవార్డులను ప్రదానం చేయాలని అన్నాడీఎంకే మహిళా విభాగం సిద్ధం అవుతోంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు వాసులకు అమ్మ అంటే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనే సంగతి అందరికీ తెలిసిందే. పార్టీ శ్రేణులతోపాటూ ప్రజలు సైతం అమ్మ అనే పదానికే అలవాటు పడిపోయారు. అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు అమ్మ అనే నామకరణం చేశారు. ప్రభుత్వ పరంగా అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మశీలు, అమ్మ సిమెంట్, అమ్మ అముదం మార్కెట్లు, అమ్మ మినరల్ వాటర్ బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా అమ్మ క్యాంటీన్లు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. అమ్మ క్యాంటీన్లలో అతి తక్కువ ధరకే మూడుపూటలా ఆహారం దొరకడంతో పేదలేకాదు, మధ్య తరగతివారు సైతం ఆకర్షితులైనారు. ఇలా అనేక పథకాలు ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. చెన్నై కార్పొరేషన్ పరిధిలో అమ్మ థియేటర్లకు రూపకల్పన సాగుతోంది. హైక్లాస్ థియేటర్లకు దీటుగా నిర్మితమయ్యే ఈ అమ్మ థియేటర్లు హైక్లాస్ అనుభవాన్ని అతితక్కువ ధరకే ఆస్వాదించేలా నిర్మించనున్నారు. ఇవన్నీ ప్రభుత్వ పరంగా సాగుతున్న అమ్మ పథకాలు కాగా, పార్టీ పరంగా సైతం అమ్మ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మహిళా విభాగం నిర్ణయించింది.
తమిళభాష కృషీవలురకు అవార్డులు:
ఇప్పటి వరకు అమలులో ఉన్న అమ్మ పథకాలు చౌక ధరలకు పలు ఉత్పత్తులు, ఆహారం అందిస్తుండగా, తమిళభాషాభి వృద్దికి పాటుపడేవారి కోసం అమ్మ అవార్డులు సిద్ధం అవుతున్నాయి. తమిళ భాషాభిమానం మెండుగా గల ప్రజానీకంలో నేటి తరం తమిళభాష జ్ఞానానికి దూరం అవుతున్నట్లు పార్టీ భావిస్తోంది. విదేశాల్లో ఉన్నత చదువుల మోజులో మాతృభాషపై మమకారాన్ని కోల్పోతున్న నేటి తరం వారిని ఉత్తేజితులను చేసే మహిళలకు అవార్డులను ప్రదానం చేయాలని సంకల్పించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడే పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల్లో తమిళభాష వ్యాప్తికి ప్రచారం చేస్తూ పాటుపడే మహిళలకు అవార్డులను అందజేస్తారు. అలాగే మహిళలు తమ పిల్లలకు సైతం మాతృభాషను బోధించాల్సి ఉంది. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి జయలలిత పేద మహిళల వివాహానికి 4 గ్రాముల మాంగల్యం, రూ.50 వేలు ఆర్థిక సాయం, ఆహారభద్రత కోసం 20 ఉచితంగా 20 కిలోల బియ్యం, మిక్సీలు, గ్రైండర్లు,ఫ్యాన్లు ఇస్తున్నారు. ఈ కోవలో అన్నాడీఎంకే పార్టీ తరపున ఇకపై అమ్మ పేరిట అవార్డులను సైతం ప్రదానం చేయనున్నారు.
ఇక అమ్మ అవార్డులు
Published Mon, Jul 27 2015 2:49 AM | Last Updated on Mon, May 28 2018 4:09 PM
Advertisement