మంత్రుల మెడపై కత్తి | Jayalalithaa drops minister Chinnayya from cabinet | Sakshi
Sakshi News home page

మంత్రుల మెడపై కత్తి

Published Thu, Mar 3 2016 2:42 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM

మంత్రుల మెడపై కత్తి - Sakshi

మంత్రుల మెడపై కత్తి

 పార్టీ, మంత్రి పదవుల నుంచి ఔట్
 పార్టీ బాధ్యతల నుంచి ఆరోగ్యమంత్రి తొలగింపు
 నెలరోజుల్లో రెండో వేటు

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి జయలలిత మరో మంత్రికి ఉద్వాసన పలికారు. పశుసంవర్ధక శాఖా మంత్రి టీకేఎస్ చిన్నయ్యను మంత్రి, పార్టీ పదవులను తప్పించారు. సీఎం సిఫార్సులను అమోదిస్తూ మంత్రి చిన్నయ్యను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లుగా గవర్నర్  కె.రోశయ్య బుధవారం ప్రకటించారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ విజయభాస్కర్‌ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించినట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఒక ప్రకటన విడుదల చేశారు.పార్టీలోనైనా, ప్రభుత్వ పాలనలోనైనా ప్రతిష్టను దెబ్బతీసే పనులకు పాల్పడితే జయలలిత సహించే ప్రశ్నేలేదు.
 
 సంజాయిషీకి ఏమాత్రం అవకాశం లేకుండా వేటు వేయడం జయలలిత నైజం. రెండేళ్ల క్రితం రాత్రికి రాత్రే అసెంబ్లీ స్పీకర్ జయకుమార్‌ను పదవీచ్యుతులను చేశారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ జయకుమార్ పేరున ఆయన అభిమానులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమే వేటుకు కారణమని అంచనా వేశారు. వాస్తవాలు నేటికీ వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం మంత్రివర్గంలోనే ఉన్న గోకుల ఇందిరను తొలగించి మళ్లీ పదవి ఇచ్చారు. తిరువళ్లూరు జిల్లాలో పార్టీకి బలమైన నేతగా మాజీ మంత్రి రమణకు పేరుంది.
 
 పార్లమెంటు ఎన్నికల్లో తిరువళ్లూరు అన్నాడీఎంకే అభ్యర్థిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచేలా రమణ కృషి చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లోనే మంత్రి పదవిని కోల్పోయారు. సుమారు ఆరునెలల విరామం తరువాత రమణకు మళ్లీ మంత్రి పదవి దక్కింది. సుమారు నెల రోజుల క్రితం రమణ ఆయన సతీమణితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వాట్సాప్‌లో చలామణి కావడంతో మరోసారి వేటుకు గురయ్యారు. గత ఐదేళ్ల కాలంలో 23 సార్లు మంత్రి వర్గ పునర్వస్థీకరణ జరుగగా, అందులో రెండుసార్లు మాత్రమే మంత్రుల మరణం వల్ల మార్పులు చోటు చేసుకున్నాయి.
 
 చిన్నబోయిన చిన్నయ్య
 అన్నాడీఎంకే 2011లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రి పదవులను కోల్పోవడం, మళ్లీ పొందడం సహజంగా మారింది. తాజాగా పశుసంవర్ధకశాఖా మంత్రి టీకేఎస్ చిన్నయ్యపై సీఎం జయలలిత వేటువేశారు. చిన్నయ్య పర్యవేక్షిస్తున్న పశుసంవర్ధకశాఖను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వలర్మతికి అదనపు బాధ్యతలుగా అప్పగించారు. అలాగే అన్నాడీఎంకే కాంచీపురం తూర్పు జిల్లా కార్యదర్శి బాధ్యతల నుంచి సైతం తప్పించారు. పుదుక్కోట్టై జిల్లా పార్టీ కార్యదర్శి బాధ్యతల నుంచి మంత్రి డాక్టర్ విజయభాస్కర్‌ను తప్పిస్తూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రకటించారు. మరి కొందరు తృతీయశ్రేణి నేతలను సైతం పార్టీ నుంచి జయలలిత పంపించివేశారు.
 
 రాజకీయ చిచ్చు రచ్చకెక్కింది
 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జయలలిత పార్టీ కేడర్‌పై డేగకన్ను వేసి ఉంచినట్లు ఇటీవల జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పార్టీ  వైద్యమంత్రి విజయభాస్కర్ పదవిని మాత్రమే పోగొట్టుకుని బతుకుజీవుడా అంటూ బైటపడ్డారు. అయినా ఆయనలో ఏదోమూల మంత్రి పదవిపై భయం నెలకొని ఉంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా పరిగణించబడుతున్న ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం కుటుంబంలో రాజకీయ చిచ్చు రచ్చకెక్కింది.
 
  ఆయన ఇద్దరు కుమారులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పట్టుపడుతున్నారు. పెద్ద కుమారుడు ఇటీవల సచివాలయానికి వచ్చి సీఎం దృష్టిలో పడే ప్రయత్నం చేశారు. అలాగే మరో కుమారుడు ప్రజాపనులశాఖ కాంట్రాక్టరుగా కొనసాగుతూ ఆ శాఖపై పెత్తనం సాగిస్తున్నాడు. ఇతని అనుమతి లేనిదే ప్రభుత్వ పనులు ఎవ్వరికీ అప్పగించకూడదనే స్థాయిలో అనధికార అజమాయిషీ చేస్తున్నాడు. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తండ్రిపై ఒత్తిడి తెస్తున్నారు.
 
  పార్టీలో పన్నీర్‌సెల్వం నెంబర్‌టూగా కొనసాగడాన్ని జీర్ణించుకోలేని ఓ వర్గం జయలలిత నెచ్చెలిని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. పనిలో పనిగా ఓపీ కుమారుల వ్యవహారాన్ని సైతం భూతద్దంలో చూపడం ద్వారా చెక్‌పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. మధురై సహా దక్షిణ తమిళనాడులో ఓపీకి మంచి బలగం ఉండడం, విశ్వాసపాత్రుడుగా కొనసాగడం వల్ల జయలలిత ఓపీని వదులుకోక పోవచ్చు. అయితే అమ్మ అంతరంగంలోని ఆలోచనలను ఎవ్వరూ పసిగట్టలేరని అందరూ ఎరిగినదే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement