అమ్మ కోలుకోవాలని
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ అపోలో ఆస్పత్రిలో చేరి అప్పుడే 13 రోజులైంది. అమ్మ కోలుకుంటున్నారని అపోలో బులెటిన్ ద్వారా వెలువడుతున్న సమాచారంతో సంబరపడుతున్నారు. నేడో రేపో ఇంటి ముఖం పడతారని అన్నాడీఎంకే శ్రేణుల కళ్లు అమ్మ కోసం కాచుకుని ఉన్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత నెల 23 తెల్లవారుజామున అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజులు పాటు ప్రశాంతంగా ఉన్న వాతావరణం 30వ తేదీ నాటికి ఒక్కసారిగా వేడెక్కింది.
అమ్మ ఆరోగ్యం క్షీణించిందని, పరిస్థి తి విషమించదనే వదంతులతో అపోలో పరిసరాలు కిటకిటలాడాయి. లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్ అనే స్పెషలిస్ట్ హడావుడిగా చెన్నై చేరుకోవడం మరింత హడావుడికి దారితీసింది. జయ ఆరోగ్యం ఎలా ఉందనే సమాచారం కోసం దేశమంతా ఆతృతతో ఎదురుచూడటం ప్రారంభించింది. అమ్మ ఆరోగ్యంపై రెండు రోజులపాటూ ఎడతెగని ఉత్కంఠ క్రమేణా తగ్గుముఖం పట్టింది. తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావు అపోలోకు వచ్చి వెళ్లడం, సీఎం కోలుకుంటున్నట్లు రాజ్‌భవన్ నుంచి ప్రకటన చేయడంతో 3,4 తేదీలకు ఉత్కంఠ నుంచి ఉపశమనం చేకూరింది.
అయితే ముఖ్యమంత్రి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి వచ్చే వరకు అన్నాడీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తూనే ఉన్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం సైతం ఆసుపత్రిలో కొద్దిసేపు గడిపారు. అపోలో వద్ద కొన్నిరోజులుగా కనపడని మాజీ మంత్రి గోకుల ఇందిర బుధవారం హాజరైనారు. యథావిధిగా మహి ళా నేతలు ఆసుపత్రి వద్దనే కూర్చున్నారు. అమ్మ ఫొటోను చేతబూనిన ముస్లింలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని ప్రార్థనలు చేశారు. ఇదిలా ఉండగా, సీఎం ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి ప్రకటించడం కాదు, ప్రభుత్వమే ప్రకటన చేయాలని ట్రాఫిక్ రామస్వామి వేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది.
ఈ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు విచారణకు స్వీకరించగా అమ్మ ఆరోగ్యంపై ప్రభుత్వం ఎలాంటి నివేదికను సమర్పించనుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జయ ఆరోగ్యంపై విషప్రచారం చేసిన 50 మందిపై పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. అమ్మ కోసం ఆత్మహత్య: అమ్మ అనారోగ్యం పాలైందన్న ఆవేదనతో విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త శరవణన్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విరుదాచలానికి చెందిన గణేషన్ అనే అన్నాడీఎంకే నేత పుదుక్కోట్టైలో బుధవారం ఆత్మాహుతి యత్నం చేశాడు.