అమ్మకే తమ మద్దతు అని మనిద నేయ జననాయగ కట్చి, పురట్చి భారతం, తమిళనాడు మక్కల్ మున్నేట్ర కళగం, మువ్వేందర్ మున్నేట్ర కళగం, అఖిల భారత మువ్వేందర్ మున్నని కళగం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఉలవర్ ఉలప్పాలర్ కట్చిలు ప్రకటించాయి. అమ్మ జయలలితతో భేటీ అనంతరం రెండాకుల చిహ్నం తో ఎన్నికల బరిలో తమ అభ్యర్థులు ఉంటారని ఆయా పార్టీల నేతలు ప్రకటించారు.
సాక్షి, చెన్నై : మళ్లీ అధికారమే లక్ష్యంగా అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత తీవ్ర వ్యూహ రచనలతో ముందుకు సాగుతున్నారు. రెండు మూడు వారాలుగా స్వయంగా అభ్యర్థుల్ని ఇంటర్వ్యూలు చేశారు. ఒక్క చెన్నై జిల్లా మినహా తక్కిన అన్ని జిల్లాల్లో ఆశావహులకు ఇంటర్వ్యూలు ముగిశాయి. పెద్ద పార్టీలు అమ్మ నీడన చేరడానికి ఇష్ట పడనప్పటికీ, కొన్ని చిన్న చిన్న పార్టీలు, సామాజిక వర్గాల సంఘాలు మద్దతు ఇస్తూనే వస్తున్నాయి. తమ కూటమిలోకి ఎవరు అడుగు పెట్టినా సరే, రెండాకుల చిహ్నంతో ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిందే అన్న మెలికను జయలలిత పెట్టారు.
ఈ మెలికతో అమ్మకు దగ్గరయ్యే యత్నం చేసి, చివరకు అయోమయానికి గురి కావాల్సిన పరిస్థితి తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌కు ఎదురైంది. 234 స్థానాల బరిలో రెండాకుల చిహ్నం రెపరెపలాడే దిశగా అభ్యర్థుల్ని రంగంలోకి దించేందుకు కసరత్తుల్లో ఉన్న జయలలితను శనివారం పెద్ద సంఖ్యలో చిన్న చిన్న పార్టీల నాయకులు, సామాజిక వర్గాల ప్రతినిధులు, సంఘాల నాయకులు కలుసుకుని తమ మద్దతును తెలియజేశారు. అమ్మ ఇచ్చే ఒకటి రెండు సీట్లతో సర్దుకున్నా, రెండాకుల బరిలో ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ఆయా నాయకులు ప్రకటించడం విశేషం.
మద్దతు : జవహరుల్లా నేతృత్వంలోని మనిద నేయ మక్కల్ కట్చిని తమీమున్ అన్సారీ చీల్చిన విషయం తెలిసిందే. మనిదనేయ జననాయగ కట్చిని ప్రకటించకున్న తమీమున్ అన్సారి డీఎంకేకు అనుకూలంగా కొన్నాళ్లు, డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమికి మద్దతుగా కొన్నాళ్లు వ్యవహరించి, చివరకు అమ్మే దిక్కు అన్నట్టుగా పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కక తప్పలేదు. తన పార్టీ వర్గాలతో కలిసి అమ్మకు మద్దతు పలికి, తమకు బలం ఉన్న నియోజకవర్గాల చిట్టాను అందజేశారు.
అమ్మ ఇచ్చే సీట్లతో రెండాకుల చిహ్నం మీద తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని మీడియా ముందు తమీమ్ ప్రకటించారు. అలాగే, తమిళనాడు మక్కల్ మున్నేట్ర కళగం నేత పి జాన్ పాండియన్, మువ్వేందర్ మున్నని కళగం నేత శ్రీధర్ వాండయార్, అఖిల భారత మువ్వేందర్ మున్నని కళగం నేత సేతురామన్, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ నేత ఫాతిమా ముజాఫర్, పురట్చి భారత నేత పి. జగన్ మూర్తి, ఉలవర్ ఉలైప్పాలర్ కట్చి నేతలతో పాటుగా సంఘాల ప్రతినిధులు, సామాజిక వర్గాల నేతలు అమ్మ ప్రసన్నంతో తమ మద్దతు అన్నాడీఎంకేకు అని ప్రకటించుకున్నారు.
ఈ భేటీలో జయలలితతో పాటుగా మంత్రులు వైద్యలింగం, ఎడపాడి పళనిస్వామి ఉన్నారు. ఇక, ఇన్నాళ్లు సినీ రంగంలో దర్శకుడిగా నటుడిగా అందరి మన్ననలు అందుకున్న ఆర్ సుందరరాజన్ ఈసందర్భంగా అమ్మ జయలలితను కలుసుకున్నారు. తాను అన్నాడీఎంకేలో చేరుతున్నట్టు ప్రకటించి అమ్మ చేతుల మీదుగా సభ్యత్వ గుర్తింపు కార్డు అందుకున్నారు.
అమ్మకే మద్దతు
Published Sun, Apr 3 2016 2:36 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM
Advertisement