అయ్యో.. నారాయణ..
సాక్షి, చెన్నై: ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిన చందంగా తన కుమారుడి పెళ్లి ఓ నాయకుడి పదవికి ఎసరు పెట్టింది. ఈ పెళ్లికి ఓ వీఐపీ హాజరు కావడంతో పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవిని ఆ నాయకుడు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అన్నాడీఎంకేలో సాగుతున్న ఉద్వాసనల పర్వంలో కొత్తకోణం. పార్టీలో గానీ, ప్రభుత్వంలోగానీ ఎవ్వరు ఏ చిన్న తప్పు చేసినా అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత క్షమించే ప్రసక్తే లేదు. చిన్న పాటి ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా తక్షణం కన్నెర్ర చేస్తారు. దీంతో ఆ నాయకుడు, ఆ మంత్రి పదవి ఊడాల్సిందే.
అదే సమయంలో ఇతర పార్టీ వర్గాలతో భుజం భుజం రాసుకుని తిరిగినట్టుగా, వారి కుటుంబ వేడుకల్లో పాల్గొన్నట్టుగా సమాచారాలు వచ్చినా ఉద్వాసనలు తప్పదు. అయితే, ఈ సారి ఓ నాయకుడి వినూత్న అనుభవం ఎదురైంది. అదే, తన కుమారుడి పెళ్లి రూపంలో పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి. ఇంతకీ ఆనాయకుడు ఎవరనుకుంటున్నారా..? అన్నాడీఎంంకే నిర్వాహక కార్యదర్శి, తిరునల్వేలి జిల్లాలో బలం ఉన్న నాయకుల్లో ఒకడైన ‘నారాయణ పెరుమాల్’.
ఊడిన పదవి: అన్నాడీఎంకేలో ప్రస్తుతం ఎంపీ శశికళ పుష్ప తిరుగుబాట ధారావాహిక హాట్ టాపిగా మారిన విషయం తెలిసిందే. కేసులు, చర్చలు, ప్రచారాలు ఓ వైపు సాగుతున్న నేపథ్యంలో శశికళల పుష్పతో సన్నిహితంగా గతంలో ఉన్న వాళ్లకు చెక్ పెట్టే పనిలో అమ్మ జయలలిత నిమగ్నమయ్యారు. ఆ దిశగా తూత్తుకుడి జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఏకంగా మంత్రి ఎస్‌పీ షణ్ముగనాథన్‌ను సైతం తొలగించారంటే పరిస్థితి తీవ్రత ఏ పాటిదో. తూత్తుకుడి జిల్లాలోని కొందరు పారిశ్రామిక వేత్తలను సైతం అన్నాడీఎంకే టార్గెట్ చేసింది. వీరితో స్థానిక నాయకులు ఎవ్వరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదన్న హుకుం జారీ అయ్యాయి.
ఇందులో పారిశ్రామిక వేత్త వైకుంఠ రాజన్ కూడా ఉన్నారు. తూత్తుకుడిని ఆనుకొని తిరునల్వేలి జిల్లా ఉండడంతో అమ్మ నిబంధనలు అక్కడి వారికీ వర్తిస్తుందన్న విషయాన్ని పార్టీ నిర్వాహక కార్యదర్శిగా ఉన్న నారాయణ పెరుమాల్ గుర్తించనట్టుంది. రెండు రోజుల క్రితం అట్టహాసంగా తిరునల్వేలిలో తన కుమారుడికి నారాయణ పెరుమాల్ వివాహం చేశారు. ఈ వేడుకకు బంధు, మిత్ర సపరివారంగా అందరూ హాజరయ్యారు. అయితే, పారిశ్రామిక వేత్త వైకుంఠ రాజన్ కూడా ప్రత్యక్షం కావడం అమ్మను ఆగ్రహానికి గురి చేసింది.
తన ఆజ్ఞల్ని ధిక్కరించే విధంగా ఈ వివాహానికి వైకుంఠ రాజన్‌ను పిలిచి ఉండడాన్ని పరిగణలోకి తీసుకున్నట్టున్నారు. దీంతో ఆఘమేఘాలపై నారాయణ పెరుమాల్ చేతిలో ఉన్న ఆ పదవిని లాగేసుకున్నారు. పదవిని కోల్పోయినా, పార్టీ సభ్యత్వం మాత్రం పదిలంగా ఉండడం నారాయణకు కాస్త ఊరటే. అదే సమయంలో వైకుంఠ రాజన్ ఆ పెళ్లి వేడుకకు వస్తున్నట్టు ముందస్తు సమాచారం ఏమోగానీ, తిరునల్వేలి జిల్లాలోని అన్నాడీఎంకే వర్గాలు ఆ వేడుకకు దూరంగా ఉండడం గమనార్హం.