అమ్మ మాట్లాడుతోంది.. ఏమన్నదో తెలుసా?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న వారికి ఒక శుభవార్త. జయలలిత వేగంగా కోలుకోవడమే కాదు.. ఆమె మాట్లాడుతున్నదని తాజాగా అన్నాడీఎంకే సీనియర్ నేత సీ పొన్నైయన్ వెల్లడించారు. ఇక జయలలిత ఆరోగ్యంపై ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
'అమ్మ మాట్లాడటం ప్రారంభించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ బాలేతో ఆమె మాట్లాడారు. తనకు ఆరోగ్యంపై శ్రద్ధ చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు' అని ఆయన 'హిందుస్తాన్ టైమ్స్'కు వెల్లడించారు. జయలలిత మరో పదిరోజుల వరకు ఆస్పత్రిలో ఉండవచ్చునని, ఆ తర్వాత మరో 15 రోజులు బెడ్ రెస్ట్ అవసరమవుతుందని, ఈ విషయంలో డాక్టర్ బాలేతో తాను నిత్యం మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు.
'జయలలితకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. అందుకే ఆమెకు కృత్రిమ శ్వాస అందించారు. అది మామూలు వైద్య ప్రక్రియ మాత్రమే. చికిత్స స్పందిస్తుండటంతో ఆమె ఆరోగ్యం మెరుగుపడింది' అని ఆయన వివరించారు.
తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత గత 20రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఈ నెల 10వ తేదీ తర్వాత మెడికల్ బులిటెన్ విడుదల చేయలేదు. దీంతో జయలలిత ఆరోగ్యం విషమించిందనే వదంతులు వచ్చాయి. మరోవైపు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, ఆమెకు అందిస్తున్న చికిత్స విషయంలో గోప్యత పాటించడంతో ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమ్మ ఆరోగ్యంపై అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెందుతూ పూజలు నిర్వహిస్తున్నారు. అయితే, జయలలిత ఆరోగ్యంపై మెడికల్ బులిటెన్లు విడుదల చేయకపోవడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అమ్మ వేగంగా కోలుకుంటున్నారని పొన్నియన్ తెలిపారు.