
వారిద్దరూ సరదాగా ఉంటారు
ఆ ఇద్దరు హీరోయిన్లు నాతో సరదాగా మాట్లాడుతూ సన్నిహితంగా ఉంటారు అంటున్నారు యువ నటుడు జయం రవి. ఒక హిట్ రాగానే ఎగిరెగిరిపోయే ఈ తరం నటుల్లో జయం రవి ప్రత్యేకం. వినయం, విధేయతలకు చిరునామా ఈయన. స్థాయికి అతీతమైన స్నేహశీలి. తొలి చిత్రం జయం నుంచి వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చిన జయం రవి కాస్త తడబడినా తాజాగా రోమియో జూలియట్, భూలోకం, అప్పాటక్కర్, తనీ ఒరువన్ చిత్రాలతో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో చిన్న భేటీ...
ప్రశ్న : జయాపజయాలను ఎలా చూస్తారు?
జవాబు: విజయం కంటే అపజయమే చాలా గుణపాఠాలు నేర్పుతుంది. అలాంటి చిత్రాల్లోనే నటుడిగా ఏమేమి మిస్ అయ్యానో, ఎలాంటి తప్పులు దొర్లాయో అన్న విషయాల గురించి పునరాలోచించుకునే ప్రయత్నం చేస్తాను.
ప్రశ్న: నటి సదా, ఆసిన్ లాంటి హీరోయిన్లు మీ చిత్రాల ద్వారానే కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ విషయం గురించి మీ అభిప్రాయం?
జవాబు: ఇందులో చెప్పేదేముంది. ఆ చిత్రాల కథలకు ఎలాంటి ఇమేజ్ లేని నూతన నటీమణులు అవసరం అయ్యారు. అందుకే వాళ్లను ఎంపిక చేశాం. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకు ప్రాచుర్యం పొందిన హీరోయిన్లు అవసరం అనిపించి నయనతార, త్రిష, హన్సిక, అంజలి లాంటి ప్రముఖ నాయికలను ఎంచుకున్నాం. భూలోకం చిత్రంలో కొన్ని సన్నివేశాలకు టిప్స్ ఇచ్చారు. ఆమె స్థానంలో వేరే నటి వుంటే ఆ సన్నివేశాలు సరిగా వచ్చేవి కావు. అదే విధంగా తనీ ఒరువన్ చిత్రంలో నటి నయనతార నాకు చాలా సపోర్ట్.
ప్రశ్న : మీతో సరదాగా ఉండే హీరోయిన్ ఎవరు?
జవాబు: జెనీలియా, త్రిష. వీరితో చాలా విషయాలు చర్చిస్తుంటాను.
ప్రశ్న: మీ స్నేహితులు ఆర్య, విశాల్‌ల పెళ్లెప్పుడు చేసుకుంటారు?
జవాబు: పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. నేనైతే విశాల్‌కు, ఆర్యకు పెళ్లి చేసి చూడమంటాను. అందులో అంత కష్టం ఉంది. త్వరగా పెళ్లి చేసుకోండయ్యా మా వల్ల మీకు చెడ్డపేరు వస్తుంది అని నేను తరచూ చెబుతుంటాను.
ప్రశ్న: ఫలాన నటుడితో సావాసం చాలా కష్టం అనిపించే సందర్భాలున్నాయా?
జవాబు: అలాంటి సందర్భం ఏదైనా ఉందంటే అది ఆర్యతోనే. ఏదైనా ఒక రహస్యం గురించి మాట్లాడి ఎవరికి తెలియరాదనుకుంటామో ఆర్య వారికే చెప్పేస్తాడు. మీ గురించి జయం ఏమి చెప్పాడో తెలుసా? అంటూ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేస్తాడు. అందుకే ఎవరిని నమ్మినా ఆర్యను మాత్రం నమ్మకూడదు.
ప్రశ్న: ఏ తరహా చిత్రాలు చేయాలని ఆశిస్తున్నారు?
జవాబు: ఎప్పుడూ విజయవావకాశాలున్న సబ్జెక్ట్స్ లభించాలని కోరుకుంటాను. అయితే ఫలానా పాత్రలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను నమ్మి, తమ చిత్రాలలో పాత్రకు జయం రవి న్యాయం చేయగలడనే నమ్మకంతో వచ్చే దర్శక చిత్రాల్లో నటిస్తాను. పేరాన్మై లాంటి చిత్రాలు అలా వచ్చినవే.
ప్రశ్న: ఫలానా నటుడితో కలసి నటించాలనే కోరిక ఉందా?
జవాబు: కోరిక ఉంది. అయితే అది జరిగే పని కాదు. కమలహాసన్ సార్‌తో నటించాలనే ఆశ ఉంది. అన్భే శివం చిత్రంలో కమల్‌తో మాధవన్ చేసిన లాంటి పాత్రలో నటించాలని ఉంది.
ప్రశ్న: దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
జవాబు: ఉంది. మీకో విషయం చెప్పాలి. కమలహాసన్ నటించిన ఆళవందాన్ చిత్రానికి నేను సహాయ దర్శకుడిగా పని చేశాను. దర్శకత్వంపై ఆసక్తి వున్నా ప్రస్తుతానికి అందుకు కొంచెం సమయం అవసరం అవుతుంది. విదేశాలకు వెళ్లి దీనికి సంబంధించిన చదువు పూర్తి చేయాలి.