
జయంరవికి నయనతో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది
తనకు సమ ఉజ్జి అయిన విలన్‌ను ఎంచుకుని అతనితో ఢీకొనే హీరో కథే తనీ ఒరువన్ చిత్రం అని సింగిల్ లైన్ స్టోరీని చెప్పేశారు ఆ చిత్ర దర్శకుడు మోహన్‌రాజాగా పేరు మార్చుకున్న జయం రాజా. ఈయన పేరు చెప్పగానే జయం, ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి, సంతోష్ సుబ్రమణియన్, తిల్లాలంగడి, వేలాయుధం లాంటి విజయవంతమైన చిత్రాలు మదిలో మెదులుతాయి. వీటిలో వేలాయుధం చిత్రం మినహా అన్నింటిలోను హీరో జయంరవినే. ఈ సక్సెస్‌ఫుల్ సోదర ద్వయం కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం తనీ ఒరువన్. స్టార్ హీరోయిన్ నయనతార తొలిసారిగా జయంరవితో జతకట్టిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడితో చిన్న భేటీ..
ప్రశ్న: మరోసారి మీ తమ్ముడు జయంరవి హీరోగా చిత్రం చేయడం గురించి?
జవాబు: నా తమ్ముడు హీరోగా నేను దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ రీమేక్‌లే. ఈ తనీ ఒరువన్ మాత్రం నేనే సొంతంగా కథ రాసుకుని దర్శకత్వం వహించిన చిత్రం. సో ఈ కథను పూర్తిగా తయారు చేసుకుని హీరో పాత్ర స్వరూపాన్ని తీర్చిదిద్దినప్పుడు ఆ పాత్రకు నా కళ్ల ముందు నిలిచింది జయం రవినే. నా తమ్ముడు చెప్పడం కాదుగాని మిత్రన్ ఐపీఎస్ పాత్రలో దుమ్ము రేపాడు.
ప్రశ్న: నయనతారతో వర్కు చేసిన అనుభవం?
జవాబు: నయనతార తొలిసారిగా నా దర్శకత్వంలో నటించారు. ఇందులో ఆమె మహిమ అనే వేలుముద్ర నిపుణురాలిగా నటించారు. జయంరవికి నయనతారకు చిత్రంలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. మంచి జోడిగా పేరు తెచ్చుకుంటారు. నయనతార చాలా అందంగా కనిపిస్తారీ చిత్రంలో.
ప్రశ్న: అరవిందస్వామి విలన్‌గా నటించారట?
జవాబు: అవును. ఆయన పాత్ర పేరు సిద్ధార్థ్ అభిమన్యు. నిజ జీవితంలో చాలా చాలా బిజీ బిజినెస్‌మన్. రవి ద్వారా ఆయన్ని కలసి కథ వినిపించా. వెంటనే ఆయన ఈ కథకు నేనెంత అవసరమో నాకు ఈ చిత్రం అంత అవసరం అంటూ రెండు నెలలు శ్రమించి కసరత్తులు తన గెటప్‌ను మార్చుకుని వచ్చారు. అబద్దం అన్నది ఎంత వశీకరంగా ఉంటుందో నిజానికి అంత క్రూరంగా ఉంటుంది. అలాగే చాలా అందమైన రూపంలో గల అరవింద చిత్రంలో అత్యంత క్రూరుడి పాత్రలో నటించారు.
ప్రశ్న: సంగీతం, చాయాగ్రహణం గురించి?
జవాబు: డుం డుం డుం చిత్ర సమయంలోనే చాయాగ్రాహకుడు రాంజీని చూశాను. ఆ తరువాత అమీర్, సెల్వరాఘవన్‌ల చిత్రాల్లో ఆయన చాయాగ్రహణ పనితనాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ చిత్రంలో ఒక అన్నలా, సూచనలు, సలహాలు మార్గదర్శిగా రాంజి నిలిచారు. ఫిలింలో తెరకెక్కించిన చివరి చిత్రం తనీ ఒరువన్. అందరూ డిజిటల్‌కు మారితే మీరు ఫిలింలో చేయడానికి కారణం ఏమిటన్నది చిత్రం చూస్తే అర్థం అవుతుంది. ఇక సంగీతాన్ని హిప్‌పాప్ తమిళ్ అది అందించారు. ఆయన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ విని విస్మయం చెందాను. యువ దశలోనే ఇంత ప్రతిభ అని నివ్వెరపోయాను. ఈ చిత్రానికి తనే పాటలు రాసి బాణీలు కట్టడం విశేషం.
ప్రశ్న: ఏఏ లొకేషన్స్‌లో చిత్రీకరణ నిర్వహించారు?
జవాబు: హైదరాబాద్, బెంగుళూర్, డెహ్రాడూన్, మసూరి కొండ ప్రాంతాలు, హరిద్వార్ గోవా, బ్యాంకాంగ్ ఇలా పలు ప్రాంతాలలో 120 రోజులు షూటింగ్ నిర్వహించాం. సెన్సార్ పూర్తి అయ్యింది. ఒక్క కట్ కూడా లేకుండా యు సర్టిఫికెట్ ఇచ్చారు.
ప్రశ్న: ఇంతకీ తనీ ఒరువన్ కథేంటి?
జవాబు: నీ స్నేహితుడి గురించి చెప్పు నువ్వు ఎలాంటి వాడివన్నది చెబుతాను అన్న నానుడి మాదిరి నీ శత్రువు గురించి చెప్పు నీ కెపాసిటీ ఏమిటన్నది చెబుతాను అన్నదే చిత్ర సింగిల్ లైన్ స్టోరి. సాధారణంగా అన్ని చిత్రాల్లోనూ విలన్ హీరోను ఎంచుకుని ఫైట్ చేస్తాడు. తనీ ఒరువన్‌లో హీరో విలన్‌ను ఎంచుకుని అతనితో ఢీ కొంటాడు. అలా అతను ఫైట్ చేసేది తన కోసం కాదు సమాజం కోసం. ఏమి చేస్తే హీరో అవుతారు? అన్న ప్రశ్నకు బదులు ఈ చిత్రంలో దొరుకుతుంది. పోలీసు కథా చిత్రాలలో తనీ ఒరువన్ ప్రత్యేకంగా ఉంటుంది.