
ఆ హిట్ చరణ్‌దేనా?
ఆగస్టు 28... శుక్రవారం. తమిళనాట ఓ సినిమా రిలీజైంది. ఎవ్వరికీ పెద్ద అంచనాల్లేవ్. హీరో ‘జయం’ రవి. దర్శకుడు ఎం.రాజా. వాళ్లిద్దరూ అన్నదమ్ములు. హీరోయిన్ నయనతార. మార్నింగ్ షో చూసి ఆడియన్స్ షాక్. స్టోరీ, టేకింగ్ చూసి థ్రిల్లైపోయారు. ఇక అక్కణ్నుంచీ థియేటర్లన్నీ హౌస్‌ఫుల్. చూసిన వాళ్లు, మళ్లీ మళ్లీ చూస్తున్నారు. చూడనివాళ్లు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. మొత్తం హిందీ, కన్నడ, తెలుగు చిత్ర సీమలను తన వైపు తిప్పుకున్న ఆ చిత్రం పేరు ‘తని ఒరువన్’.
‘దృశ్యం’ తర్వాత మళ్లీ ఓ హాట్ కేక్!
మలయాళ ‘దృశ్యం’ ఇప్పటికే అయిదు భాషల్లో రీమేక్ అయి విజయం సాధించింది. మళ్లీ ఆ సినిమా తర్వాత ‘తని ఒరువన్’ హాట్ కేక్‌లా మారింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ చేయాలని హేమాహేమీలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు నుంచి రామ్‌చరణ్, మహేశ్‌బాబు, హిందీ నుంచి సల్మాన్‌ఖాన్, కన్నడ ంలో పునీత్ రాజ్‌కుమార్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక కథానాయిక జెనీలియాకు ఈ సినిమా తెగ నచ్చేసి మరాఠీ వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించడానికి సై అన్నారు. బెంగాలీ వెర్షన్ రీమేక్ హక్కుల గురించి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. బాలీవుడ్ విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూడలేదు కానీ, ఆయన ప్రొడక్షన్ యూనిట్ ఇప్పటికే ఈ సినిమా చూసి, రీమేక్ రైట్స్ తీసుకోవటం కోసం డిస్కషన్స్ మొదలుపెట్టారట!
తెలుగులో రామ్‌చరణ్ హీరోనా?
ప్రస్తుతం ‘బ్రూస్‌లీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్‌చరణ్ ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యారట. రీమేక్ అయినా కచ్చితంగా చేయాలని అనుకుంటున్నారట. ఎందుకంటే రామ్‌చరణ్ ఇప్పటివరకూ 9 సినిమాలు చేశారు కానీ, అన్నీ డెరైక్ట్ స్టోరీలే. ఇది చేస్తే ఫస్ట్ రీమేక్ అవుతుంది ఆయనకు. రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ సినిమా నిర్మించిన సీనియర్ నిర్మాత ఎన్.వి.ప్రసాద్, ప్రస్తుతం ‘బ్రూస్‌లీ’ తీస్తున్న డీవీవీ దానయ్య కలిసి ఈ సినిమా రీమేక్ చేయాలని అనుకుంటున్నారట! మరోపక్క మహేశ్‌బాబుకు కూడా ఈ సినిమా తెగ నచ్చేసిందట! మహేశ్‌కి కూడా రీమేక్‌లంటే పెద్దగా ఇష్టం ఉండదు. గతంలో శంకర్ ‘త్రీ ఇడియట్స్’ రీమేక్ ఆఫర్ ఇస్తేనే తిరస్కరించాడు. మరిప్పుడు మహేశ్ ఈ సినిమా చేస్తారా లేదా అన్నది చూడాలి.
సైంటిస్ట్‌తో పోరాటం!
మొత్తం అన్ని భాషల హీరోలు, దర్శక, నిర్మాతలను తనవైపు తిప్పుకున్న ఈ సినిమాలో అసలు ఏముంది... కథాకమామిషు ఏంటి? తెలుసుకుందాం. మిత్రన్ (‘జయం’ రవి), అతని స్నేహితులు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్. డ్యూటీలో చేరక ముందే తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూంటారు. మిత్రన్ ప్రేయసి మహిమ (నయనతార) కూడా వాళ్లతో చేతులు కలుపుతుంది. ఈ క్రమంలోనే ఓ సామాజిక కార్యకర్త వీళ్ల కళ్లముందే హత్యకు గురవుతాడు. ఇలాగే వరుస హత్యలు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలుగా వాళ్లు గుర్తిస్తారు. ఫైనల్‌గా ఇదంతా ఫేమస్ సైంటిస్ట్ సిద్ధార్థ్(అరవింద స్వామి) చేస్తున్నాడని తెలుసుకుంటారు. చివరకు సిద్ధార్థ్ధ్‌ను వాళ్లు ఎలా ఎదిరించారన్నది మిగిలిన కథాంశం.
తమిళంలో చివరి ‘నెగటివ్’ సినిమా!
ఈ సినిమా ఇప్పటికే వసూళ్లు కొల్లగొడుతూంటే, మరో రూపంలో ఇది చరిత్రలో నిలిచిపోనుంది. తమిళంలో ‘నెగటివ్’ వాడిన చివరి సినిమా ఇదే.