తనీఒరువన్‌కు ఏడాది
తనీఒరువన్ చిత్రం తెరపైకి వచ్చి ఏడాది అయ్యింది. జయం రవి, నయనతార జంటగా నటించిన తొలి చిత్రం ఇది. ఇందులో అరవిందస్వామి ప్రతినాయకుడిగా నటించారు. కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా నిర్వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భారీ నిర్మాణ విలువలతో నిర్మించింది. తనీఒరువన్ గత ఏడాది విడుదలైన చిత్రాలలో ఒక సంచలనం. కథలో వైవిధ్యం,కథనంలో నవ్యత, దర్శకత్వంలో కొత్తదనం, వెరసి అద్భుత విజయం సాధించి 2015లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. జయంరవిని కమర్షియల్ హీరోగా మరింత ఉన్నత స్థాయికి చేర్చిన చిత్రం ఇది. దీంతోపాటు ఆయనకు పలు అవార్డులను,అభినందనలను అందించింది.
మోహన్‌రాజాకు రీమేక్ దర్శకుడన్న ముద్రను తుడిచేస్తూ విడుదలై సంచలన విజయాన్ని సాధించిన తనీవరువన్ ఏడాదిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర హీరో జయంరవి తన ఆనందాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అందులో ఆయన పేర్కొంటూ తనీఒరువన్ తెరపైకి వచ్చి ఏడాది గడిచినా చిత్రంలో నటించిన తనకు ఇంకా ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయన్నారు. చిత్రం పేరు తనీఒరువన్ (ఒకే ఒక్కడు) అయినా చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ తమ శక్తి వంచన లేకుండా శ్రమించారన్నారు.
ముఖ్యంగా ఎంతో పరిశోధించి అద్భుతమైన కథను తయారు చేసి నిరంతర శ్రమతో చిత్రాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు మోహన్‌రాజాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. అలాగే చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం, నటీనటులు, చిత్ర నిర్మాతల శ్రమ, కృషే తనీఒరువన్ చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఈ చిత్రం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఇకపై చేసే చిత్రాలను తనీఒరువన్‌కు దీటుగా చేయాలన్న లక్ష్యాన్ని సూచించిందని పేర్కొన్నారు. ఇక పోతే తనీఒరువన్ చిత్రానికి సీక్వెల్ గురించి పరిశ్రమలో చాలానే చర్చ జరుగుతోందన్నారు. అయితే తాను, తన సోదరుడు మోహన్‌రాజా వేర్వేరు చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల తనీఒరువన్ సీక్వెల్ గురించి సరిగా చర్చించలేదని తెలిపారు.