► రాష్ట్రంలో పడుపువృత్తిలో లక్ష మంది
► అనధికారికంగా మూడు లక్షలు!
► సమస్యల జీవితం.. మురికికూపంలోకి నెట్టేసిన ఘోరం
► వ్యథార్థుల బతుకుల్ని కళ్లకు కట్టిన జయమాల నివేదిక
► ఉత్తర కర్ణాటకలో తీవ్రంగా సమస్య
► దోపిడీ సమాజంలో బలవుతున్న సమిధలు
వారు కూడా సమాజంలో గౌరవంగా జీవించాలని, గొప్ప కుటుంబాల మహిళలుగా ఆదరణ అందుకోవాలని, భర్త పిల్లలతో ఆనందంగా బతకాలని ఎంతో తపిస్తుంటారు. కానీ విధి వైపరీత్యం, సమాజంలోని కొందరు దురాశాపరుల వల్ల జీవితం బుగ్గిపాలైంది. సమాజంలో అందరిచేత వెలివేయించుకునే పడుపువృత్తిని నమ్ముకునే రోజులు వెళ్లదీస్తున్నారు. పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనం.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో సామాజిక అసమానతలు వీరిని నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఈ అభాగినుల వేదనకు కారణాలు.. మానవతకే మచ్చ. ఇంకా ఇలాంటి దుర్భర సమాజం నడుస్తోందా? అన్న ఆవేదన అందరి మది తొలిచేస్తుంది. రాష్ట్రంలో పడుపువృత్తిపై నటి, ఎమ్మెల్సీ జయమాల కమిటీ రిపోర్టు గుండెలు పిండేసే చేదు నిజాలను బయటపెట్టింది.
విధుల్లోనూ తేడాలుంటాయ్
= కొంతమంది ప్రతి రోజూ, మరికొంతమంది వారానికి రెండు రోజులు మాత్రమే సెక్స్‌వర్కర్లుగా ఉంటారు.
= మరికొంతమంది నెలలో మొదటి పది రోజులు ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకూ సెక్స్‌వర్కర్లుగా ఉంటారు. ఈ పరిస్థితి బెంగళూరు నగరంలో 90 శాతం వరకూ ఉండగా మిగిలిన అన్ని జిల్లాల్లో 10 శాతంగా నమోదైంది.
= కొంతమంది మూడు నెలల పాటు ఇతర రాష్ట్రాల్లో సెక్స్‌వర్కర్లుగా ఉంటూ తిరిగి తమ స్వంత ఇంటికి వచ్చేస్తారు. ఇటువంటి సందర్భంలో ఇంటి పెద్దలు, లేదా భర్త అనుమతి, సహకారం కూడా ఉండటం గమనార్హం.
అమ్మాయి వెల రూ.15వేలు
విజయపురకు చెందిన 14 ఏళ్ల అమ్మాయిని ఒక వ్యక్తి ఉద్యోగం చూపిస్తానని చెప్పి మైసూరుకు తీసుకువచ్చాడు. ఒక ఇంట్లో 15 రోజుల పాటు ఉంచుకుని అన్ని విధాలుగా దోచుకున్నాడు. వారం పాటు మరో వ్యక్తి కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి ‘మీ నాన్నకు రూ.15 వేలు ఇచ్చి నెల రోజుల పాటు నిన్ను ఇక్కడకు తీసుకువచ్చాం.’ అని చెప్పారు. సమయం ముగిసిన తర్వాత ఇంట్లో వదిలేశారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఈ వృత్తిలో ఉంటోంది. నివేదిక ప్రభుత్వం అందే సమయానికి ఆ అమ్మాయి వయస్సు 16 ఏళ్లు.
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే సొంత ఇంట్లోనే పడుపువృత్తి నిర్వహించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. వివాహితులే ఇందులో అధికం. 13 ఏళ్లకే బలవంతంగా ఈ కూపంలోకి వచ్చే బాలికల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొత్తంగా రాష్ట్రంలో 1,00,676 మంది (సెక్స్‌వర్కర్లు) వేశ్యా వృత్తిని జీవనాధారంగా చేసుకున్నారు. ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జయమాల ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో ఇవి ప్రధాన అంశాలు. రాష్ట్రంలోని సెక్స్‌వర్కర్ల జీవన విధానంపై అధ్యయనానికి సిద్ధరామయ్య సర్కారు జయమాల కమిటీని నియమించింది.
ఏడాది అధ్యయనం చేసి...
దాదాపు ఏడాది పాటు రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఈ కమిటీ క్షేత్రస్థాయి పర్యటన జరిపి ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ వృత్తిలో ఉన్నవారితో స్వయంగా మాట్లాడింది. మొత్తం 169 ప్రశ్నావళికి సమాధానాలు రాబట్టి బృహత్ నివేదికను తయారు చేసి మార్చి 19న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందజేసింది. ఈ విధంగా సెక్స్‌వర్కర్ల జీవన విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా అధ్యయనం జరపడం దేశంలో ఇదే మొదటిసారి.
ఇక సదరు కమిటీ సెక్స్‌వర్కర్ల జీవన విధానం మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రస్తావించింది. నివేదికలో తాము పేర్కొన్న సంఖ్య కంటే మూడు రెట్ల మంది ఎక్కువగా ఈ వృత్తిలో ఉంటున్నట్లు కమిటీనే పేర్కొంది.
కార్పొరేట్ దంపతుల దాష్టీకం
బెళగావికి చెందిన 24 మహిళను ముంబై నుంచి వచ్చిన వ్యక్తి పెళ్లి చేసుకుని వెంట తీసుకువెళ్లాడు. నెలకు నాలుగువేలు చొప్పున ఒక సంపన్నుల ఇంట్లో పనికి అప్పగించాడు. నెల నెలా డబ్బులు తీసుకెళ్లడానికి మాత్రమే వచ్చేవాడు. ఇంటి యజమాని దంపతులు ఒక పెద్ద సంస్థలో ఉన్నతోద్యోగులు. వారు ఆ మహిళతో లైంగిక వాంఛలు తీర్చుకునేవారు. 30 ఏళ్లు వచ్చాక ఈ మహిళను కొంత సొమ్ము ఇచ్చి ఇంటికి పంపేశారు. పరిస్థితులు అనుకూలించక ఆమె వేశ్యావృత్తిలో కొనసాగుతోంది.
సెక్స్‌వర్కర్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన చేయూత ఇలా
= రాష్ట్రంలోని సెక్స్‌వర్కర్ల సంక్షేమం కోసం రూ.733 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి.
= ఈ వృత్తిలో ఉండి 45 ఏళ్లు దాటిన వారికి అంత్యోదయ కార్డుతో పాటు ప్రతి నెలా రూ.5వేల భృతిని ఇవ్వాలి.
= హెచ్‌ఐవీతో బాధపడుతున్నవారికి ఉచిత మందులు ఇవ్వడంతో పాటు ప్రతినెలా రూ.5వేల భృతి చెల్లించాలి.
= ఈ వృత్తి నుంచి బయటపడాలనుకునేవారికి రోజుకు రూ.300 ఇస్తూ వివిధ వృత్తి విద్యల్లో శిక్షణ ఇవ్వాలి.
= సొంతంగా వ్యాపారం, పశుపోషణ తదితర విషయాల పై ఆసక్తికలిగిన మహిళలకు రూ.1లక్షలకు ఎటువంటి వడ్డీ, తనఖా లేకుండా రుణాలు ఇవ్వాలి.
= ప్రతి ఏడాదికి కనీసం 1,000 మంది సెక్స్‌వర్కర్లకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.