
కాటి కాపరికి కల్పనా చావ్లా అవార్డు
కేకే.నగర్(చెన్నై): పురుషులే పనిచేయడానికి భయపడే విద్యుత్ దహన వాటికలో ఆపరేటర్‌గా చేరింది ఆమె. ఇప్పటి వరకు 2,800 మృతదేహాలను దహనం చేసింది. కుటుంబ పరిస్థితే తనకు భయాన్ని పోగొట్టిందని సగర్వంగా చెబుతోంది. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చిన తమిళనాడు ప్రభుత్వం కల్పనాచావ్లా అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే ‘తమిళనాడులోని నామక్కల్ సమీపంలోని కూలి పట్టి మా సొంత ఊరు. పట్టుగురుకల్ బ్రాహ్మణ కులానికి చెందిన మా నాన్న కూలి పట్టి సుబ్రమణ్యస్వామి ఆలయంలో పూజారి.
కూలిపట్టిలోని ప్రైవేటు, నామక్కల్ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాను. నామక్కల్ కలింజ్ఞర్ రామలింగ పిళ్లై కళాశాలలో ఆర్థిక విభాగంలో ఎంఏ పట్టభద్రురాలు అయిన తరువాత వాసుదేవకి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పూటగడవడమే కష్టంగా ఉన్న పరిస్థితిలో ప్రైవేటు ట్రస్టు తర ఫున విద్యుత్ దహన వాటికలో యంత్రాన్ని నడిపే ఆపరేటర్‌గా వచ్చిన అవకాశాన్ని స్వీకరించాను. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇలాంటి పనికి వెళ్లకూడదని అత్త, మామ, భర్త తెలిపారు.
కుటు ంబ పరిస్థితి నాలో భయాన్ని పోగొట్టింది. చనిపోయిన వా రు దైవంతో సమానం అనుకుని ధైర్యం తెచ్చుకున్నాను. నేను ఈ పని చేస్తానని చె ప్పినప్పుడు ట్రస్టు నిర్వాహకులు నమ్మలేదు. నెల జీతం తీసుకోకుండా పని చేశావంటే నీ మీద మాకు నమ్మకం కుదురుతుంది.. అప్పడు పర్మనెంట్ చేసి జీతం ఇస్తామని చెప్పారు. నెల రోజులు నేను శ్రమించిన దానికి ఫలితంగా ప్రస్తుతం అదే సంస్థలో మేనేజర్‌గా పదోన్నతి పొందాను. రాష్ట్ర ప్రభుత్వం నన్ను కల్పనాచావ్లా అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో గర్వంగా ఉంది’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు జయంతి.