కోటి లక్ష్యం
సాక్షి, చెన్నై: ఐదు నెలల్లో కోటి మంది సభ్యుల్ని చేర్చడం లక్ష్యంగా కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ జిల్లాల బాటకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు సభ్యత్వ నమోదు కసరత్తులు వేగవంతం చేస్తూ, మరో వైపు శ్రీరంగం బరిలో అభ్యర్థిని నిలబెట్టేందుకు కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బలోపేతమే లక్ష్యంగా బీజేపీ ఉరకలు తీస్తోంది. దక్షిణాదిలో తమిళనాడు అసెంబ్లీలోనే తమ ప్రతినిధులు లేని దృష్ట్యా, ఈ సారి ఎలాగైనా ప్రతినిధులు అడుగు పెట్టడం లేదా, తమ మద్దతుతో ప్రభుత్వం అధికారంలోకి రావడం లేదా, తమ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా తీవ్ర కుస్తీలు పట్టే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టాక తమిళి సై సౌందరరాజన్ అధిష్టానం ఆదేశాలతో తన వ్యూహాలను అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఐదు నెలల్లో కోటి మందిని తమ పార్టీ సభ్యులుగా చేర్చాలన్న తలంపుతో పరుగులు తీస్తున్నారు. గత వారం చేపట్టిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వస్తుండడం కమలనాథుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వారం వ్యవధిలో లక్ష మంది తమ పార్టీలో సభ్యులుగా చేరడాన్ని పరిగణనలోకి తీసుకున్న కమలనాథులు అదే ఊపుతో కోటి మందిని చేర్చేందుకు పరుగులు తీస్తున్నారు.
జిల్లాల బాట : సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించారు. జిల్లాకు ఒకటి చొప్పున ఈ కమిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తాను సైతం జిల్లాల్లో పర్యటించే పనిలో పడ్డారు. మంగళవారం వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల పర్యటనతో తన కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. బుధవారం కోయంబత్తూరు, ఈరోడ్, గురువారం విల్లుపురం, కడలూరు, శుక్రవారకం తిరుచ్చి, రామనాథపురం జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతూ తమిళి సై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ, ఐదు నెలల్లో కోటి మంది సభ్యుల్ని చేర్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక కమిటీలతో పాటుగా ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు, టోల్ ఫ్రీ సభ్యత్వ నమోదు ఇలా అనేక మార్గాల్లో సభ్యుల్ని చేర్నే పనిలో ముందుకు సాగుతున్నామన్నారు.
శ్రీరంగం బరిలో... : ఓ వైపు సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తూనే, మరో వైపు శ్రీరంగం ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ దృష్టి పెట్టింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో డీఎండీకే, ఎండీఎంకేల మద్దతుతో ఏ విధంగా తమ అభ్యర్థులు బరిలోకి దిగారో, అదే బాట అనుసరించేందుకు రెడీ అవుతున్నారు. మళ్లీ ఆ పార్టీ నాయకులను కలిసి మద్దతు సేకరణకు వ్యూహ రచనలో పడ్డారు. శ్రీరంగం ఉప ఎన్నిక తమకు కలసి వచ్చే అంశంగా కమలనాథులు పేర్కొంటుండడంతో అన్నాడీఎంకే అభ్యర్థిని ఢీ కొట్టి బలమైన అభ్యర్థి అన్వేషణలో కమలాలయం వర్గాలు నిమగ్నమైనట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.