తమిళిసై ‘టీమ్’ రెడీ!
సాక్షి, చెన్నై : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తన టీమ్‌ను రెడీ చేసుకున్నారు. 25 మందితో ఓ జాబితాను సిద్ధం చేశారు. ఢిల్లీకి పంపించి, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలతో ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తమిళి సై సౌందరరాజన్‌ను గత వారం ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో పాత కార్యవర్గం రద్దు అయింది. కొత్త కార్యవర్గం ఎంపికపై తమిళి సై దృష్టి పెట్టారు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనలు, ఆదేశాల మేరకు కార్యవర్గ ఎంపికకు ఓ జాబితాను ఎంపిక చేసే పనిలో పడ్డారు. పార్టీ సీనియర్లు, పార్టీ అనుబంధ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో సంప్రదింపుల జరిపినానంతరం సరికొత్తగా ఓ టీమ్‌ను తమిళి సై సిద్ధం చేశారు. కొత్త ముఖాలకు చోటు కల్పించే ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా జన సంఘ్‌లో పనిచేసిన వాళ్లు, జైళ్లకు వెళ్లిన వాళ్లు, రామ జన్మభూమికి కర సేవకులుగా పనిచేసిన వాళ్లకు ఇందులో ప్రాధాన్యత ఇచ్చారు. వీరిలో 25 మందికి తొలి ప్రాధాన్యత ఇచ్చే విధంగా జాబితా రెడీ అయింది.
జాబితా : ఈ జాబితాలో తంజావూరు ఎంఎస్‌రామలింగం, నాగర్‌కోవిల్ ఎంఆర్ గాంధీ, న్యాయవాది విక్టోరియ గౌరి, చెన్నై సీఎస్‌సీ వడి వేలు, కాంచీపురం ఎంవి సంపత్, న్యాయవాది కేటీ రాఘవన్, రామనాధపురం సుభా నాగరాజన్, మదురై రాజరత్నం, పొన్ కరుణానిధి, దిండుగల్ తిరుమలై స్వామి, తిరునల్వేలి పాండి దురై, కృష్ణగిరి మునవరీ బేగం, నామక్కల్ తమిళ రసి యోగం, కోయంబత్తూరు ఎస్‌ఆర్ శేఖర్, జికే సెల్వకుమార్, సేలం శివరామన్, తిరుచ్చి సుబ్రమణ్యం, ఇల కన్నన్, హోసూరు బాలకృష్ణన్, కడలూరు ఎస్వీ శ్రీధర్, శివగంగై న్యాయవాది చొక్కల లింగం, తిరువళ్లూరు ఎం భాస్కరన్, ఈరోడ్ శరవణన్, విల్లుపురం ఏజీ గాంధీ, దక్షిణ చెన్నై డాల్ఫిన్ శ్రీధరన్ పేర్లు ఉన్నాయి.
ఢిల్లీకి : జాబితా సిద్ధం కావడంతో దానిపై సోమవారం మరో మారు పునఃసమీక్షానంతరం మంగళవారం ఢిల్లీకి పంపించేందుకు తమిళి సై కసరత్తుల్లో ఉన్నారు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి ఈ జాబితాను తీసుకెళ్లనున్నారు. ఆయన ఆమోదంతో ఎవరెవరికి ఏ పదవులు దక్కుతాయోనన్నది తేలనుంది. ఆయన ఆదేశాల మేరకు జాబితాను ఢిల్లీ నుంచి ప్రకటించడం లేదా, రాష్ట్రానికి ఆయన్ను ఆహ్వానించి ప్రకటింప చేయడం లక్ష్యంగా తమిళి సై పావులు కదుపుతున్నారు. ఈనెలాఖరులో లేదా, సెప్టెంబర్ మొదటి వారంలో కేరళ, తమిళనాడు పర్యటనకు అమిత్ షా రెడీ అవుతున్న సమాచారంతో ఆయన ద్వారానే ఈ జాబితా ప్రకటింప చేసే అవకాశాలు ఉన్నాయి.