బొమ్మనహళ్లి/ బనశంకరి: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఈసీ డేగ కన్ను వేసింది. తమ తనిఖీ బృందాలు ముమ్మరంగా దాడులు జరిపి అక్రమ వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈవో) సంజీవ్‌కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం విధానసౌధలో తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1,156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 1,255 స్థిర తనిఖీ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని, కోడ్ ఉల్లంఘనలను అరికడుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 12,537 గోడల పైన రాసిన రాతలను, 17,693 వాల్ పోస్టర్‌లను,7,711 ఫ్లెక్సి బ్యానర్లను తొలగించడం జరిగిందన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1.63 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 30 వేల విలువ చేసే 198 దోసె తవ్వలు, 2 లక్షలవిలువైన వంటపాత్రలు కూడా పట్టుకున్నామన్నారు. 18 కేసులను నమోదు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 131 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా 3054 లైసెన్స్‌డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 1807 మంది నేరచరితులపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మీద 90 వేల పైన ఆయుధాలను వశపరచుకున్నారు. కాగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో నాయకుల ముఖాలకు ముసుగులు వేస్తున్నారు. బెంగళూరులో కెంపేగౌడ విగ్రహాలు శనివారం ఉదయం నుంచి ముసుగులతో దర్శనమిచ్చాయి.
చెక్‌పోస్టులు, కేంద్ర బలగాలు: సీపీ
ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు నగర వ్యాప్తంగా 400కు పైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు అన్నివైపులా భారీ భద్రత కల్పించినట్లు నగర పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర పరిధిలోని 28 నియోజకవర్గాల్లో భద్రత కోసం సుమారు 45 కంపెనీల కేంద్ర రిజర్వు బలగాలను తరలించామన్నారు. ఇప్పటికే 15 కంపెనీల బలగాలు నగరానికి చేరుకున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఏసీపీ నోడల్ అధికారిగా నియమించామని, ఆరు సంచార బృందాలను నియమించి అందులో రెవెన్యూ, పోలీస్ శాఖకు చెందిన అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు.
ప్రతి నియోజకవర్గానికి మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. నగర సరిహద్దులో 20 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడక్కడ పోలీస్ అధికారులు తాత్కాలిక చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 400కు పైగా పరిశీలనా బృందాలు ఎన్నికల్లో అక్రమాలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులను తీవ్రంగా పరిగణిస్తామని సునీల్‌కుమార్ తెలిపారు. రాహుల్‌గాంధీ పర్యటన సందర్బంగా బెంగళూరు నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా శుక్రవారం లభించిన రూ. కోటిన్నర నగదు ఏ పార్టీ తెలియదని, విచారణ చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment