అందరి కళ్లూ కర్ణాటక పైనే | Editorial on Karnataka 2019 Elections | Sakshi
Sakshi News home page

అందరి కళ్లూ కర్ణాటక పైనే

Published Thu, Mar 29 2018 1:07 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Editorial on Karnataka 2019 Elections - Sakshi

కర్ణాటకకూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కూ చాలా పోలికలు ఉన్నాయి. రెండు భాషా ప్రయుక్త  రాష్ట్రాలూ 1956లోనే ఆవిర్భవించాయి. ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత 1977లో లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో రెండు రాష్ట్రాలూ ఇందిరా గాంధీకి అండగా నిలిచాయి. 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ రెండు రాష్ట్రాల లోనూ కాంగ్రెస్‌ (ఐ) విజయఢంకా మోగించింది. 1983లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు కాంగ్రెస్‌  కంచుకోటను బద్దలు కొడితే, కర్ణాటకలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత రామకృష్ణ హెగ్డేకి దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం కన్నడిగులకు ఆనవాయితీ. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవడం కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. 

1978లో జనతా పార్టీ నాయకుడు మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది. 1983లో కాంగ్రెస్‌ కర్ణాటకలో చిత్తుగా ఓడిపోయినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. 1989లో కేంద్రంలో రాజీవ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ఓడిపోగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్ని కలలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 1994లో కాంగ్రెస్‌ నేత పీవీ నర సింహారావు ప్రధానిగా ఉండగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో దేవెగౌడ నాయ కత్వంలోని జనతాదళ్‌ గెలిచింది. 1999లో కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ ఉన్న సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఢంకా బజాయించింది. 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

జేడీఎస్, మరికొన్ని చిన్న పార్టీలతో పొత్తుపెట్టుకొని కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగింది. ఇప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అప్పుడు జేడీఎస్‌ ప్రతినిధిగా తొలి సంకీర్ణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2006లో దేవెగౌడ  కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందడం కర్ణాటక సంప్రదాయం కాదు కనుక కాంగ్రెస్‌ గెలుపొంది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠంపైన కొనసాగితే అది చరిత్ర. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కన్నడిగులు ఓటు చేస్తారనే ఆనవాయితీకి భంగం కలగదు. అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయే సంప్రదాయాన్ని కాదని సిద్ధరామయ్య కాంగ్రెస్‌ పార్టీని గెలిపించగలరా? 

సిద్ధరామయ్య అనేక విషయాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పోల్చదగిన వ్యక్తి. వైఎస్‌ మాదిరే సిద్ధరామయ్య కూడా సంక్షేమ కార్యక్రమాలకు అగ్రతర ప్రాధాన్యం ఇచ్చారు.  అన్నభాగ్య, ఆరోగ్యభాగ్య, క్షీరభాగ్య, ఇందిరా క్యాంటీన్‌ల వంటి జనరంజక పథకాలతో సిద్ధరామయ్యకు వ్యక్తిగతంగా మంచి పేరుప్రతిష్ఠలు వచ్చాయి. సామాన్య ప్రజలలో ఆయన పట్ల ఆదరణ పెరిగింది.  ఆత్మగౌరవ నినాదంతో, కర్ణాటకకు ప్రత్యేక పతాకం అనే విధానంతో కన్నడిగులలో ఆవేశం రగిలించి వారి అభిమానం సంపాదించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ను ప్రచారంలోకి దింపి మతపరమైన అవేశం పెంచడానికి బీజేపీ చేసిన ప్రయత్నానికి ఇది విరుగుడు.  

వెనుకబడిన తరగతులూ, దళితులూ, ముస్లింలను ఏకం చేసి ఒక సామాజిక కూటమిని సిద్ధరామయ్య ఏర్పాటు చేశారు. చివరగా లింగాయత్‌ల భావజాలాన్ని ఒక  ప్రత్యేక మతంగా గుర్తించి వారికి మైనారిటీ హోదా ఇవ్వాలంటూ కర్ణాటక అసెంబ్లీ చేత తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారు. ఓటర్లలో 17 శాతం ఉన్న లింగాయత్‌లు చాలాకాలంగా బీజేపీ మద్దతుదారులు. వారిలో చీలిక తేవడానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే సిద్ధరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. 

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పను తక్కువగా అంచనా వేయ కూడదు. కర్ణాటకలోని  బీజేపీ నాయకులలో అత్యంత ప్రాబల్యం కలిగిన వ్యక్తి యడ్యూరప్ప. అవినీతి ఆరోపణలపైన జైలుకు వెళ్ళినప్పటికీ న్యాయస్థానాలు ఆయనను నిర్దోషిగా తేల్చాయి. సిద్ధరామయ్య మంత్రివర్గంలోని కొందరు సీని యర్లపైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెండు పార్టీల లోనూ గ్రూపులు ఉన్నాయి.  ముఖ్యమంత్రి ఎంత ప్రయత్నించినా లింగాయత్‌లు బీజేపీని పూర్తిగా విడిచిపెట్టే ప్రమాదం లేదు. బీజేపీ నాయకులు అందరూ ఆధారపడేది ప్రధాని  నరేంద్ర మోదీ జనాకర్షణశక్తిపైనే. 

మోదీ ప్రచారంతో ప్రజలు బీజేపీకి సుము ఖంగా మారుతారని వారి ఆశ, విశ్వాసం. కాంగ్రెస్, బీజేపీ కాకుండా బరిలో ఉన్న మూడో పార్టీ జేడీఎస్‌. కర్ణాటకలోని అన్ని ప్రాంతాలలో జేడీఎస్‌కి బలం లేక పోయినప్పటికీ, హసన్, మైసూర్‌ ప్రాంతంలో ఈ పార్టీకి తిరుగులేని పట్టు ఉంది. మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వం ఈ పార్టీకి ఒక ఊతం. కార్మికులలో కుమా రస్వామికి గల పలుకుబడి మరో సానుకూల అంశం. మాయావతి నాయకత్వం లోని బహుజన సమాజ్‌ పార్టీ, వామపక్షాల మద్దతు జేడీఎస్‌కు ఉన్నది. అయితే, దీనికి తండ్రీకొడుకుల పార్టీ అనే పేరు ఉంది. ఏ పార్టీకీ మెజారిటీ రాని స్థితి (హంగ్‌ అసెంబ్లీ) ఏర్పడితే జేడీఎస్‌ పాత్ర కీలకం అవుతుంది. 2004 ఎన్నికలలో జరిగిన విధంగానే ఈ సారీ అతిపెద్ద  పార్టీగా కాంగ్రెస్‌ కానీ బీజేపీ కానీ రావచ్చు. 

జేడీఎస్‌ ఎవరితో భుజం కలిపితే వారు అధికారంలోకి రావచ్చు. కర్ణాటకను గెలు చుకుంటే బీజేపీకి 2019 సార్వత్రిక ఎన్నికల ముందు శుభశకునం అవుతుంది. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ నిలబెట్టుకుంటే ఆ పార్టీ ఆబోరు దక్కుతుంది. బీజేపీకి ప్రత్యా మ్నాయం కాంగ్రెస్‌ మాత్రమే అన్న భావన బలపడుతుంది. జేడీఎస్‌ది ‘కింగ్‌ మేకర్‌’ పాత్ర కనుక ఎటు పోయి ఎటు వచ్చినా ఆ పార్టీకి ఇబ్బంది లేదు. ఏప్రిల్‌ 15న ఓట్ల లెక్కింపు. విజయం ఏ పార్టీని వరిస్తుందో చూడాలన్న ఉత్కంఠ దేశ వ్యాప్తంగా ఉన్నది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement