సిద్ధగంగ మఠం జూనియర్ స్వామీజీ సిద్ధలింగ స్వామి
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌ల అంశం ప్రధానంగా తెరపైకి రావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లింగాయత్‌ల ఓట్లకు గాలం వేస్తున్నాయి. లింగాయత్‌లలో మంచి పట్టున్న సిద్ధగంగ మఠానికి నేతల తాకిడి తీవ్రమైంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే మఠాధిపతి శివకుమార స్వామిని కలిశారు. వీరశైవ లింగాయత్‌ల విశ్వాసాలను ప్రతిబింబించే సామాజిక కట్టుబాట్లను అనుసరించే ఆథ్యాత్మిక, మత గురువుగా 11 ఏళ్ల శివకుమార స్వామికి లింగాయత్‌లలో మంచి పేరుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలంతా సిద్ధగంగ మఠం బాట పట్టారు. సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కట్టబెట్టి వారిని ప్రసన్నం చేసుకోవడంలో ముందుండగా, బీజేపీ అదే వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో లింగాయత్‌ల ఓట్లు తమకేనన్న ధీమాలో ఉంది.
మరోవైపు తాము ఓటర్లను ప్రభావితం చేయబోమని, రాజకీయ నేతల భవిష్యత్ కార్యక్రమాలు ఫలించాలని వారిని మఠం దీవించడం వరకే పరిమితమవుతుందని సిద్ధగంగ మఠం జూనియర్ స్వామీజీ సిద్ధలింగ స్వామి స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంలో కర్ణాటకలో మఠాలు ఎందుకు కీలకంగా మారతాయన్న ప్రశ్నలకు ఆయన బదులిస్తూ తమకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, మత.ఆథ్యాత్మిక పరంగా రాజకీయ నేతలకు మఠాలు ఆశీస్సులు అందిస్తాయని చెప్పుకొచ్చారు. తాము ఓటింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తామని, తాము ఎన్నడూ ఏ పార్టీ పక్షాన నిలవబోమని స్పష్టం చేశారు. దేశ పౌరులుగా తాము విధిగా ఓటు వేయాలని, ప్రజలు ముందుకొచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని మాత్రమే పిలుపు ఇస్తామని చెప్పారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని మఠాలు కోరబోవని..ప్రభుత్వాలు మాత్రం ఉదాత్త లక్ష్యంతో పనిచేసే మఠాలకు చేయూత ఇస్తున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment