కేజేపీకి ‘విలీన’ కష్టాలు..! | KJP vilina trouble! | Sakshi
Sakshi News home page

కేజేపీకి ‘విలీన’ కష్టాలు..!

Published Sun, Jan 5 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

KJP vilina trouble!

= అడ్డుపడుతున్న వ్యవస్థాపక అధ్యక్షుడు
 = స్పీకర్‌ను కలిసిన పద్మనాభ
 = విలీన ప్రక్రియ ఆపడానికి సుప్రీం కోర్టుకు
 = మీడియా సమావేశంలో వెల్లడి

 
సాక్షి, బెంగళూరు : కర్ణాటక జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్పకు కంట్లో నలుసుగా తయారైన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మనాభ ప్రసన్న ‘విలీన’ ప్రక్రియకు అడ్డు పడుతున్నారు. కేజేపీ అధ్యక్ష స్థానం విషయమై కోర్టులో కేసు నడుస్తున్నందు వల్ల ఆ పార్టీ బీజేపీలో విలీనం కావడానికి అంగీకరించకూడదనేది ఆయన వాదన. పద్మనాభ ప్రసన్న స్పీకర్ కాగోడు తిమ్మప్పను విధానసౌధలో శనివారం ఉదయం భేటీ అయ్యారు.

కేజేపీ అధ్యక్షుడి విషయమై స్పష్టత వచ్చే వరకూ విలీన ప్రక్రియకు అంగీకరించకూడదని వినతి పత్రం సమర్పించారు. అంతేకాంకుడా విలీన ప్రక్రియపై స్టే కోరుతూ తాను సుప్రీం కోర్టులో సోమవారం కేసు వేస్తున్నట్లు కూడా ఆయన  మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర శాసన సభ బీజేపీ ఫ్లోర్ లీడర్ జగదీష్ శెట్టర్ తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ కాగోడు తిమ్మప్పకు శనివారం మధ్యాహ్నం 1:20 గంటలకు విధాన సౌధలో వినతి పత్రం సమర్పించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేజేపీ బీజేపీలో విలీనం కావడానికి అంగీకరించాలని స్పీకర్‌ను కోరామన్నారు. ఆ పార్టీకి చెందిన న లుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం వల్ల శాసనసభలో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య జేడీఎస్ కంటే నాలుగుకు పెరుగుతుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందువ ల్ల బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం హోదా కల్పించాలని కూడా స్పీకర్‌ను కోరినట్లు శెట్టర్ మీడియాకు తెలిపారు.

రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకోనున్నట్లు స్పీకర్ చెప్పారన్నారు. ప్రస్తుతం బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తాను కేజేపీ విలీనం తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతానన్నారు. ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఈనెల 9న బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో లాంఛనంగా పార్టీలోకి చేరుతారన్నారు. పద్మనాభ ప్రసన్న అభ్యంతరంపై తనకు పూర్తిస్థాయి సమాచారం లేదని శెట్టర్ పేర్కొన్నారు.
 
పదిరోజుల్లోపు పూర్తి చేస్తా : స్పీకర్

 
కేజేపీ ఎమ్మెల్యేలను బీజేపీ ఎమ్మెల్యేలుగా గుర్తించే విషయంతోపాటు, బీజేపీకి ప్రధాన ప్రతిపక్షహోదా కల్పించే ప్రక్రియకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప పేర్కొన్నారు. అయితే  గరిష్టంగా పదిరోజుల్లోపు ఈ రెండు ప్రక్రియలు పూర్తవుతాయన్నారు. కేజేపీ మొత్తం ఎమ్మెల్యేలలో మూడింట రెండువంతులు (ఆరుగురు ఎమ్మెల్యేలలో నలుగురు) బీజేపీలో చేరడానికి అంగీకారం తెలపడం వల్ల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కేజేపీ ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీ అన్నారు. అందువల్ల విలీన ప్రక్రియకు అనుమతించడం లేదా నిలిపి వేయడం అన్నది ఎన్నికల కమిషన్ పరిధికి వస్తుందన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది నుంచి సంవత్సరానికి 60 రోజుల పాటు తప్పకుండా చట్టసభలు నిర్వహిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు రూపొందించిన క్యాలెండర్‌ను ప్రభుత్వ అనుమతికి పంపించామని కాగోడు తిమ్మప్ప మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సవ ూధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement