ఆశించిన స్థాయిలో పాలన లేదు
జేఏసీ చైర్మన్ కోదండరాం
వీణవంక: ఉద్యమ కాలంలో ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పాలన కొనసాగడంలేదని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ వస్తే నౌకరీ వస్తదని ప్రజలు ఆశపడ్డరు... కానీ ఆ పరిస్థితి కనిపించడంలేద’న్నారు. తెలంగాణకు సింగరేణి గుండెకాయలాంటిదని ఈ ప్రాంత ప్రజలకు ఎంతో దోహదపడుతుందన్నారు. అలాంటి సింగరేణిని విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా పాలకుల లాగే మన పాలకులు కూడా కేవలం హైదరాబాద్ అభివృద్ధి మీదనే దృష్టి పెట్టారని ఆరోపించారు.
మరీ మిగితా జిల్లాల అభివృద్ధి విస్మరించడం మంచిది కాదని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలను విస్మరించకుండ అభివృద్ధి చేయాలని సూచించారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా చేయాలని కోరారు. ఏటా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, అదేవిధంగా వ్యవసాయం, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని అన్నారు. రానున్న రోజుల్లో జేఏసీని విస్తరిస్తామని జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర జేఏసీ నాయకులు వెంకట్‌రెడ్డి, పిట్టల రవీందర్, ప్రహ్లాద్ తదితరులు ఉన్నారు.