
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఉదయం 11 గంటల తర్వాత సర్వదర్శనం
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం.
ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి రానుండటంతో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేస్తారు. ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు వైధికంగా శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దుచేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా మంగళవారం వీఐపీ దర్శనం నిలిపివేస్తున్నట్టు జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు.