రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కనులపండువగా జరుగుతోంది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెల్లవారుజామున 1:45 గంటలకు ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.
తిరుమల/ద్వారకాతిరుమల/సింహాచలం/అన్నవరం/సాక్షి ప్రతినిధి,విజయనగరం: తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముక్కోటి దేవతలు వెంటరాగా మలయప్ప దివి నుంచి భూ వైకుంఠానికి వేంచేయడంతో సప్తగిరులు పులకించాయి. వైకుంఠం నుంచి వచ్చిన వేంకటేశుడి దర్శనానికి ఉత్తర ద్వారం స్వాగతం పలికింది.
శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన అనంతరం అర్చకులు వైకుంఠ ఏకాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైకుంఠ ద్వారాలను తెరిచి పూజలు చేశారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే ఈ ద్వారాలను తెరుస్తారు. కొన్నేళ్ల నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పింస్తున్నారు. సామాన్య భక్తులకు 5.15 గంటలకే సర్వదర్శనాన్ని ప్రారంభించారు.
వైభవంగా స్వర్ణరథోత్సవం
శ్రీవారి ఆలయంలో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగారు. రథోత్సవాన్ని గ్యాలరీల్లోంచి భక్తులు దర్శించి తరించారు. టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి చక్రస్నానాన్ని నిర్వహించనున్నారు.
ప్రధాన ఆలయాలకు భక్తుల తాకిడి..
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని చిన వెంకన్న ఆలయంలో స్వామి వారు ఉత్తరద్వారాన వెండి గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. 40 వేల మందికి పైగా చినవెంకన్నను దర్శించుకున్నారు. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠ వాసుడిగా శేష తల్పంపై వేంజేసి దర్శనమిచ్చారు.
స్వామి వారిని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను 50 వేల మందికిపైగా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. విశాఖ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఉత్తర ద్వారం నుంచి తొలి దర్శనం చేసుకున్నారు.
విజయనగరం జిల్లాలోని రామతీర్థం సీతారామస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా నీలాచలం బోడికొండ చుట్టూ 12 కి.మీ మేర గిరి ప్రదక్షిణ చేశారు. ఉదయం 5 గంటలకు ఉత్తర సీతారామచంద్రస్వామి ఉత్తర రాజగోపురం నుంచి దర్శనమిచ్చారు. ఆలయం వద్ద 10 వేల మందికి అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment