సాక్షి, తిరుమల/భద్రాచలం/యాదగిరిగుట్ట: తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కనులపండువగా జరుగుతోంది.
ఉత్తరద్వారం నుంచి దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రం శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భూలోక వైకుంఠంగా మారింది. శ్రీసీతాలక్ష్మణసమేతుడైన రామచంద్రస్వామి ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో భద్రగిరి పులకించింది.
వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ధూపదీపాల మధ్య వైకుంఠ రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదభి రాముడు గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తరద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు.
వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట (çపూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునే ప్రధానాలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆచార్యులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు ఏర్పాట్లు చేశారు.
ఉదయం శ్రీస్వామి వారు గరుడ వాహనంపై లక్ష్మీనృసింహస్వామి అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం వద్ద వైకుంఠనాథుడిగా భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం శ్రీస్వామిని విష్ణుమూర్తిగా అలంకరణ చేసి మత్సా్వతారంలో మాడవీధిలో సేవను ఊరేగించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, అనిరు«ద్‌రెడ్డి, అదనపు జిల్లా జడ్జి మారుతీదేవి, సబ్ జడ్జి దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో..
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైకుంఠం నుంచి వచ్చిన వేంకటేశుడి దర్శనానికి ఉత్తర ద్వారం స్వా గతం పలికింది. అలాగే.. శ్రీవారి ఆలయంలో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగారు. రథోత్సవాన్ని గ్యాలరీల్లోంచి భక్తులు దర్శించి తరించారు.
Comments
Please login to add a commentAdd a comment