
సాక్షి, చెన్నై : ప‍్రముఖ హాస్య నటి కోవై సరళ శుక్రవారం కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. చెన్నైలో మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమల్ హాసన్ ఇవాళ కోవై సరళను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. కోవై సరళకు పార్టీ సభ్యత్వాన్ని అందించిన కమల్ హాసన్ ఆమె సేవలు అవసరమని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమవుతున్న కమల్ హాసన్‌కు కోవై సరళ పార్టీలో చేరిక కోయంబత్తూరు పరిసర కొంగునాడు ప్రాంతంలో కొంత బలాన్నిస్తుంది.
కొంతకాలంగా రాజకీయాలలో చేరికపై కోవై సరళ దూరంగా ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో చిరకాల మిత్రుడు, సహ నటుడు కమల్ హాసన్‌కు మద్దతు తెలపటంతో పాటు పార్టీలో చేరటం మక్కల్ నీది మయ్యం పార్టీకి కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ సందర్బంగా కోవై సరళ మాట్లాడుతూ ఎంఎన్ఎం పార్టీ కోసం కమల్ సూచనల మేరకు పని చేసేందుకు సిద్దమని అన్నారు. హాస్య నటిగా దక్షిణాన గుర్తింపు పొందిన కోవై సరళ మంచి వక్త కూడా. ఇకపై రానున్న ఎన్నికల ప్రచారంలో కోవై సరళ వ్యంగ్యాస్త్రాలు ఎలా పేలనున్నాయో చూడాలి మరి.