అండగా ఉంటాం !
ప్రగతిపథంలో పయనిస్తున్న తమిళనాడు వంటి రాష్ట్రాలకు అణువిద్యుత్ కేంద్రం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. నాలుగు కనెక్షన్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షులు పుతిన్, ముఖ్యమంత్రి జయలలిత కూడంకుళంలోని అణువిద్యుత్ కేంద్రాన్ని భారత జాతికి బుధవారం అంకితం చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: కూడంకుళం పరిసర గ్రామాల ప్రజలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి జయలలిత హామీ ఇచ్చారు. అణువిద్యుత్‌పై ప్రజల్లో నెలకొన్న అనవసర భయాందోళనలను రూపుమాపాల్సి ఉందని చెప్పారు. రెండో యూనిట్‌లో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం అవసరమని అన్నారు. అణువిద్యుత్ కేంద్రాన్ని అందించిన రష్యా అధ్యక్షులు పుతిన్‌కు, రష్యా ప్రజలకు జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్-రష్యా మైత్రిలో ఇది ఒక మైలురాయని అభివర్ణించారు. వాతావరణ, పర్యావరణ సమస్యలకు తావులేకుండా దేశాభివృద్ధికి దోహదం చేయగలదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్-రష్యా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు రష్యా భాషలో మోదీ చెప్పారు.
అణువిద్యుత్ కేంద్రం రూపుదిద్దుకున్నది ఇలా..
భారత్-రష్యా సంయుక్తంగా తిరునెల్వేలి జిల్లా కూడంకుళంలో రూ.22 వేల కోట్లతో రెండు యూనిట్లతో అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు 1998లో ఒప్పందం జరిగింది. అణువిద్యుత్ కేంద్రం వల్ల ప్రజలకు పెనుముప్పు తప్పదంటూ ఉదయకుమార్ అనే సామాజిక కార్యకర్త నేతృత్వంలో 2011 ఆగస్టు నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. కూడంకుళం పరిసర గ్రామాల్లోని ప్రజలను ఉద్యమకారులు భయంకపితులను చేశారు. అణువిద్యుత్ కేంద్రం వల్ల వాతావరణ కాలుష్యం, ప్రాణాపాయం తప్పదని మత్స్యకార గ్రామాల్లోని వారిని రెచ్చగొట్టి ఉద్యమానికి పురిగొల్పారు. ఆందోళనలతో సుమారు ఆరు నెలలపాటు కూడంకుళంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగి నిర్మాణ పనులు స్తంభించిపోయాయి.
పోలీసులు అరెస్ట్‌లకు దిగడంతో ఆందోళనకారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అణువిద్యుత్ కేంద్రం వల్ల ఎటువంటి ముప్పులేదని సుప్రీంకోర్టు 2013 మే 6న తీర్పు చెప్పింది. అంతేగాక అణువిద్యుత్ నిపుణులు నచ్చజెప్పడంతో క్రమేణా ఆందోళనలు సద్దుమణిగి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. 2012 సెప్టెంబర్ 19న విద్యుత్ ప్లాంట్లలో ఇంధనం నింపడం ప్రారంభమై అక్టోబర్ 2తో ముగిసింది. 2013 అక్టోబర్ 22వ తేదీ తెల్లవారుజాము 2.45 గంటలకు కూడంకుళంలో 160 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమై 2014 జూన్ 7వ తేదీ నాటికి వెయ్యిమెగావాట్ల ఉత్పత్తికి చేరుకుంది. ఒక్కో యూనిట్ సామర్థ్యం వెయ్యియూనిట్లు కాగా మొత్తం రెండువేల యూనిట్ల ఉత్పత్తికి సిద్ధమైంది. తొలి యూనిట్ పనులు 2013లో పూర్తికాగా అదే ఏడాది జులై 13న విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. తొలి యూనిట్ సక్రమంగా పనిచేస్తున్న దశలో రెండో యూనిట్ కూడా పూర్తిచేసుకుని విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది.