
పేరు, ప్రతిష్టలు ఏనాడో సంపాదించా!
తాను పేరు, ప్రతిష్టల కోసం రాజకీయాల్లోకి రాలేదని, వాటిని ఏనాడో సంపాదించానని నటి కుష్బు తెలిపారు. కుష్బు అఖిల భారత కాంగ్రెస్
టీనగర్: తాను పేరు, ప్రతిష్టల కోసం రాజకీయాల్లోకి రాలేదని, వాటిని ఏనాడో సంపాదించానని నటి కుష్బు తెలిపారు. కుష్బు అఖిల భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలలో ఉండడంతో సినిమాలకు స్వస్తి చెప్పారు. అయినప్పటికీ చిత్ర నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ‘అరన్మణై’ రెండవ భాగం చిత్ర నిర్మాణంలో ఉన్నారు. తరచుగా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. అనేక మంది వ్యతిరేకతను ఎదుర్కొంటూ కోర్టు కేసులకు హాజరవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎంపికయిన తర్వాత ట్విట్టర్‌లో తన అభిప్రాయాలు వ్యక్తీకరించడంలో బిజీగా ఉన్నారు. ప్రతిరోజూ అనేక మంది కుష్బూపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అందుకు ఆమె కూడా బదులిస్తున్నారు. ఒకరు కుష్బు రాజకీయ ప్రవేశాన్ని నిరసిస్తూ ప్రశ్నించారు. మీరు రాజకీయాల్లోకి రావడం డబ్బు కోసమా? పేరు ప్రతిష్టల కోసమా? అంటూ ప్రశ్నించాడు. అందుకు కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బదులిచ్చారు. తాను 25 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నానని, విలాసవంతమైన జీవితం కోసం అవసరమైన డబ్బు, హోదాను సంపాదించానని తెలిపారు.