ఆ పేదింటి పునాదిలో 435 బంగారు నాణేలు
బెంగళూరు: ఆమె అనుకుంటే ధనవంతురాలై పోవచ్చు.. రోజుకో బంగారు నాణాన్ని డబ్బుగా మార్చుకొని దర్జాగా బతికేయొచ్చు. తన పేదరికం మొత్తాన్ని పెకిలించి పారేయొచ్చు. కానీ, పేరుకు పేదళ్లం అయినా తమలో నిజాయితీ తప్పకుండా ఉంటుందని ఓ మారుమూల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే 55 ఏళ్ల మహిళ నిరూపించింది. తన ఇంటికోసం తీస్తున్న పునాదిలో దాదాపు 435 పురాతన బంగారు నాణేలు బయటపడినా వాటిల్లో ఏ ఒక్కటి తను ఉంచుకోకుండా గ్రామస్తులు ఇచ్చే సలహాను పట్టించుకోకుండా నేరుగా పోలీసులకు అందించి మన్ననలు పొందింది.
అందుకు పోలీసులు ఆమెను పలువిధాలుగా మెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగ్గా బెంగళూరుకు 100 కిలో మీటర్ల దూరంలోని బాణ సముద్ర అనే గ్రామంలో లక్ష్మమ్మ అనే 55 ఏళ్ల మహిళ ఉంది. ఆమె తనకు ఓ ఇంటిని నిర్మించుకునేందుకు శంఖుస్థాపన కోసం గుంట తవ్వడం ప్రారంభించింది. కొంతమంది కూలీవాల్లను పెట్టుకొని ఆ పనిలో నిమగ్నం కాగా అందులో నుంచి తొలుత కొన్ని నాణేల మాదిరిగా బయటకొచ్చాయి. అవన్నీ బురదమయమై ఉన్నాయి.
అలాగే, ఇంకొంచెం తవ్వగా ఏకంగా 400కు పైగా నాణేలు బయటకొచ్చాయి. వీటిని అనంతరం శుభ్రం చేయగా అవి బంగారు నాణేలు అని దాదాపు గుర్తించారు. ఆ విషయం ఆమెకు కూడా అర్థమైంది. అయితే, గ్రామస్తుల్లో కొందరు వాటిని స్వర్ణకారులకు చూపించమని, ఎవరికీ చెప్పకుండా ఆమెతోనే ఉంచుకొమ్మని సలహా ఇచ్చారు. కానీ, అవన్నీ పట్టించుకోకుండా నేరుగా వెళ్లి పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి వాటని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో ద్వారా ప్రభుత్వానికి అప్పగించగా వాటిని పురావస్తు శాస్త్రవేత్తలకు పరిశీలన కోసం అప్పగించారు.