లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదుల కోసం తీవ్రగాలింపు
Published Tue, Jan 7 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫరాబాద్ జిల్లాలో మతకల్లోలాల ఘటన తర్వాత కొత్త సభ్యుల నియామకం కోసం ప్రయత్నించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. గత సెప్టెంబర్‌లో జరిగిన ముజఫర్‌నగర్ మతకల్లోలాల ఘటనలో ఒక వర్గానికి చెందిన సుమారు 60 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ ఇచ్చిన సమాచారం మేరకు గత డిసెంబర్‌లో లష్కరే తోయిబా కార్యకలాపాలపై కేసు నమోదు చేశారు. అనంతరం హర్యానా రాష్ట్రం మేవాట్ ప్రాంతంలో ఎండీ షాహిద్, ఎండీ రషీద్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారిని విచారించగా చాలా కొత్తవిషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రత్యేక పోలీస్ కమిషనర్ (ప్రత్యేక సెల్) ఎస్.ఎన్.శ్రీవాత్సవ కథనం మేరకు వివరాలు.. రషీద్, మరో సహచరుడితో దియోబంద్ వెళ్లి ముజఫర్‌నగర్‌లో నివసించే లియాఖత్ (58) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కలిశాడు. లియాఖత్ వారిద్దరిని ముజఫర్‌నగర్ జిల్లాలోని ఠాణాూ బహవన్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారు ముజఫర్‌నగర్‌కు చెందిన జమీర్, మరో ఇద్దరు వ్యక్తులతో భేటీ అయ్యారు. లియాఖత్, జమీర్ ముజఫర్‌వాసులే అయినా మతఘర్షణల్లో వారికి ఎటువంటి నష్టం జరగలేదు. స్థానికంగా సభలు నిర్వహించేందుకు కావాల్సిన సొమ్మును కిడ్నాప్‌లు చేయడం ద్వారా సంపాదించాలని పథకం పన్నినట్లు జమీర్‌కు వచ్చిన వారు చెప్పారు.
అయితే జమీర్ వారితో కలిసి పనిచేయడానికి ముందుకు రాలేదు. అనంతరం రషీద్, మరో వ్యక్తి పల్వాల్ మీదుగా మేవాట్ వెళ్లిపోయారు. ఈ దశలో పోలీసులు లియాఖత్, జమీర్‌లను అరెస్టు చేసి వారినుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ప్రస్తుతం అబ్దుల్ సుభాన్,అఫ్తాబ్ అన్సారీ, ఆమిర్ రజాఖాన్, జావేద్ బలాచీ తదితరుల గురించి గాలిస్తున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు.
Advertisement