తిరువళ్లూరు: న్యాయవాదులకు వ్యతిరేకంగా తమిళనాడులో చట్టాన్ని రూపొం దించడానికి తీసుకుంటున్న చర్యలను ఖండిస్తూ తిరువళ్లూరు జిల్లా బార్ అసోసియేషన్ ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైలురోకోకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. మద్యం తాగి కోర్టుకు హాజరు కాకూడదు, కేసును వాదించే సమయంలో న్యాయమూర్తిని కించపరిచేలా వ్యవహరించకూడదు, తప్పులు చేసే న్యాయవాదిని బార్ అసోసియేషన్‌కు సంబంధం లేకుండా న్యాయమూర్తే చర్యలు తీసుకుకోవచ్చనే వెసులుబాటును కల్పిస్తూ హైకోర్టు న్యాయమూర్తి కౌల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చర్యలను నిరసిస్తూ రెండు వారాల నుంచి న్యాయవాదులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. దశల వారి ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రైలురోకో చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరులో న్యాయవాదుల ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైలురోకోకు యత్నించారు. న్యాయవాదుల హక్కులను హరించేలా చట్టాలను రూపొందిస్తున్న కౌల్ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
చట్టాలను వెంటనే వెనుక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం రైలురోకోకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర స్తాయిలో వాగ్వాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్పీ శ్యామ్‌సన్, అదనపు ఎస్పీ స్టాలిన్, డీఎస్పీ విజయకుమార్ న్యాయవాదులతో చర్చలు జరిపి న్యాయవాదులను వదలిపెట్టారు.
పోలీసులు వర్సెస్ న్యాయవాదులు
Published Thu, Jun 30 2016 1:16 AM | Last Updated on Fri, Aug 31 2018 9:02 PM
Advertisement