ఎన్డీఎస్ఎల్ కార్మికుల కన్నీటి వెతలు
ఫ్యాక్టరీ మూతతో బతుకులు రోడ్డుపాలు
ఎనిమిది నెలలుగా పస్తులే దిక్కు
అడ్డా కూలీలుగా అవతారం..
సర్కార్‌కు పట్టడం లేదంటూ ఆగ్రహం
'అమ్మా.. రూ.100 ఇవ్వమ్మా. రోజంతా మీ మక్క బుట్టలు కాల్చి పెడతా. అడ్డా మీద పనిదొరకటం లేదమ్మా. వయస్సు మీద పడిందని ఎవరూ పనికి పిలవడం లేదు’ అని ఓ వ్యక్తి ముఖం కనిపించకుండా రుమాలు కట్టుకుని మెదక్ పాత బస్టాండ్ వద్ద ఓ మహిళను ప్రాధేయపడుతున్నాడు. ‘వద్దయ్యా.. మాకే గిరాకీ లేదు’ అంటూ ఆమె సమాధానం ఇవ్వడంతో ఆ వ్యక్తి కన్నీరు పెట్టుకున్నాడు. ఇది గమనించిన సదరు మహిళా మక్కబుట్టలు కాల్చు అంటూ పనిలో పెట్టుకుంది. అతను ఎవరో? కాదు.. సుమారు రెండున్నర దశాబ్దాల పాటు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన ఓ కార్మికుడు. ఫ్యాక్టరీ మూతపడటంతో అతనిలా చాలా మంది ఇదే దుస్థితిలో ఉన్నారు. కార్మికుల స్థితిగతులపై క్షేత్రస్థారుు పరిశీలనాత్మక కథనం..
మెదక్: మెదక్ మండల పరిధి మంబోజిపల్లి శివారులోని 25 ఏళ్ల క్రితం నిజాం దక్కన్ షుగర్(ఎన్డీఎస్‌ఎల్) ఫ్యాక్టరీ ఏర్పాటైంది. అప్పట్లోనే 600 మంది పైచిలుకు కార్మికులు పనిచేసేవారు. దాదాపు ఐదు లక్షల టన్నుల చెరకు గానుగాడించేవారు. దీంతో అటు చెరుకు రైతులు, ఇటు కార్మికులకు చేతినిండా పని లభించేది. అరుుతే, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపణలు ఉన్నారుు. అప్పటి నుంచి అటు కార్మికులను, ఇటు కర్షకులను ప్రైవేటు యాజమాన్యం అనేక ఇబ్బందులకు గురిచేసింది. 400 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్‌ఎస్ ఇచ్చి పంపించేశారని తెలిసింది. గత సంవత్సరం ఫ్యాక్టరీని నడిపించకపోవడంతో రైతులు చెరుకును విక్రరుుంచుకునేందుకు నానాతంటాలు పడ్డారు. 8 నెలల క్రితం ఫ్యాక్టరీకి యాజమాన్యం అక్రమంగా లే-ఆఫ్ ప్రకటించడంతో దాదాపు 130 మంది కార్మికులు పూట గడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
(మెదక్ లో భిక్షాటన చేస్తున్న ఎన్డీఎస్ఎల్ కార్మికులు( ఫైల్))
ఆటో నడుపుతున్నా..
ఫ్యాక్టరీలో 25 ఏళ్లు పనిచేశా. ఒక్కసారిగా లే-ఆఫ్ ప్రకటించడంతో 8 నెలలుగా పస్తులు ఉంటున్నాం. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయారుు. ఎక్కడా పనిదొరకలేదు. దీంతో హైదరాబాద్‌లో ఓ ఆటో అద్దెకు తీసుకొని నడుపుతున్నా. దాంతో వచ్చే ఆదాయమే నా కుటుంబానికి ఆధారం. - నరహరి
కంపెనీలో రోజు కూలీ
ఫ్యాక్టరీ యాజమాన్యం లే-ఆఫ్ ప్రకటించి మమ్మల్ని రోడ్డుపాలు చేసింది. పిల్లల చదువులు ఆగిపోయారుు. ఇంట్లో ఎవ్వరూ కడుపు నిండా తిండి తినడం లేదు. జహీరాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రోజువారీ కూలీ చేస్తున్నా. వయస్సు పైబడటంతో గట్టిగా పనిచేయలేకపోతున్నా. అరుునా తప్పదు కదా. - శంషీర్ అలీ
వ్యవసాయ పనులు చేస్తున్నా..
ఫ్యాక్టరీని అకారణంగా మూసేయడంతో మా కుటుంబం రోడ్డుపాలైంది. దీంతో రోజుకూలీకి వెళ్తున్న. ఏ పని దొరికితే అది చేస్తున్నా. లేకుంటే ఉపవాసం ఉండాల్సిందే. మంభోజిపల్లి అడ్డా మీదకు వెళ్తున్నా. కూలి కోసం. అలవాటులేని వ్యవసాయ పనులు చేస్తున్న. చాలా ఇబ్బంది పడుతున్నా.
- బి.పోచయ్య
కూలి పనులకు వెళ్తున్నా..
ఎన్నో ఏళ్లుగా కంపెనీలో కష్టపడి పనిచేశాం. యాజమాన్యం మాత్రం అక్రమ లే-ఆఫ్ ప్రకటించి మమ్మల్ని రోడ్డుపాలు చేసింది. కుటుంబమంతా ఆకలితో గడుపుతున్నాం. ఫ్యాక్టరీలో యంత్రాలు నడిపిన చేతులతో వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నా.
- కె.సత్తయ్య
ప్రభుత్వం కక్ష కట్టింది
తెలంగాణ రాష్ట్రం కోసం మేము అనేక ఆందోళనల్లో పాల్గొన్నాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకుంటామన్న కేసీఆర్ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఫ్యాక్టరీలో ప్రభుత్వ వాటా ఉన్నా లే-ఆఫ్ ఎలా ప్రకటిం చారో అర్థం కావట్లేదు. దిక్కులేక ని త్యం కూలీ పనులు చేస్తున్నా
- కె.కృష్ణ
పీఎఫ్, గ్రాట్యుటీ ఇవ్వలేదు
రిటైర్డ్ అరుున కార్మికులకు పీఎఫ్, గ్రాట్యుటీ కూడా ఇవ్వలేదు. 8 నెలలుగా లే-ఆఫ్ ప్రకటించడంతో చాలా మంది ఇంటి వద్దే ఉండిపోయారు. ఇప్పటికే ముగ్గురు కార్మికులు బాధతో చనిపోయారు. అరుునా, ప్రభుత్వం స్పందించడం లేదు.
- భీంరెడ్డి