సాక్షి, ముంబై: విధాన పరిషత్ (లెజిస్లేటివ్ కౌన్సిల్) పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఇది వరకే తమ అభ్యర్థులను ప్రకటించగా మిత్రపక్షమైన కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు పేర్లను వెల్లడించలేదు. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. గవర్నర్ కోటాలో నియమితులయ్యే 12 మందిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు పేర్లను ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో అయోమయం నెలకొంది.
పుణే, ఔరంగాబాద్ విధాన పరిషత్‌లోని పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి జూన్ 20న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలసి పోటీ చేయనున్నాయి. ఆ ప్రకారం ఎన్సీపీ రెండు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సీపీ తమ కోటాలోని ఔరంగాబాద్ నుంచి సతీష్ చవాన్‌కు మళ్లీ అవకాశమివ్వగా, పుణే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సారంగ్ పాటిల్‌కు అవకాశమిచ్చింది.
కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఆందోళన ఎక్కువవుతోంది. అదేవిధంగా పుణే ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీకి మనీషా పాటిల్, రాజ్‌మానే పాటిల్, ప్రకాశ్ పాటిల్ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తావ్డే కుమారుడు ప్రకాశ్ తావ్డే, నాగపూర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బబన్‌రావ్ తావ్డే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాగపూర్ నియోజక వర్గం నుంచి పోటీకి బీజేపీ ప్రకాశ్ సోలే పేరు ప్రకటించింది.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. సీట్ల కేటాయింపుపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మధ్య రెండుసార్లు చర్చలు జరిగాయి. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు.
మోగింది ఎన్నికల నగారా
Published Tue, May 27 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement