
27న లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ఈ నెల 27వ తేదీన బీజేపీ విడుదల చేసే అవకాశముంది. ఆ రోజున ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమవనుంది.
ఈ విషయాన్ని బీజేపీ అగ్రనాయకుడు అరుణ్‌జైట్లీ ట్విటర్‌లో వెల్లడించారు. తమ పార్టీ అధిష్టానం 27న తొలి జాబితా విడుదల చేసే అవకాశముందన్నారు. ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, నరేంద్రమోడీ, సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్‌జోషీలు ఆ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. సీనియర్ నాయకులకు సంబంధించిన టికెట్లను ఖరారుచేసే అవకాశముందన్నారు. తమ తమ నియోజకవర్గాలపై పట్టుగల నాయకులకు సీట్ల కేటాయింపు జరిగిపోతుందన్నారు.
ఆ విషయంలో ఎటువంటి వివాదాలకూ తావు లేదన్నారు. మరో రెండు నెలల్లోగా ఎన్నికలు జరిగే అవకాశముందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 272 స్థానాల్లో విజయానికి సంబంధించి అత్యంత చేరువలో ఉన్నామన్నారు. మరికొన్ని స్థానాల్లో తమ మిత్రపక్షాలు విజయం సాధిస్తాయంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక స్థానాలనను తమ పార్టీ కైవసం చే సుకోవడం తథ్యమని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఈసారి రెండంకెలకు అవలీలగా చేరుకోగలమని అన్నారు. అంతకంటే ఎక్కువ వచ్చినా విచిత్రమేమీ లేదన్నారు.