
ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జయ
లండన్, ఎయిమ్స్ వైద్యుల రాక
వదంతులపై మరో ఇద్దరు అరెస్ట్
సెల్‌ఫోన్ టవర్ ద్వారా నిఘా
జయ ఆరోగ్యం కోసం ఇద్దరు ఆత్మాహుతి
అపోలోకు ‘రిలయన్స్’ నీతూ అంబానీ రాక
తమిళనాడు వ్యాప్తంగా కొనసాగుతున్న పూజలు
రాష్ట్రానికి త్వరలోనే కొత్త గవర్నర్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో 23 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు లండన్, ఎయిమ్స్ వైద్యుల బృందం గురువారం చెన్నైకి చేరుకుంది. ఆమెకు చికిత్స అందించేందుకు గతంలో వచ్చిన అంతర్జాతీయ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఎయిమ్స్ వైద్యులు గిల్‌నానీ(ఊపిరితిత్తుల నిపుణుడు), అంజన్ టిరిక్కా(అనస్తీషియన్), నితీష్‌నాయక్(హృద్రోగ నిపుణులు) మరోసారి అపోలోకు చేరుకుని వైద్య చికిత్సలు ప్రారంభించారు.
సీఎం జయను పరామర్శించేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతూ అంబానీ గురువారం రాత్రి అపోలో ఆస్పత్రికి వచ్చారు. జయకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, తమిళనాడు మాజీ గవర్నర్ కే రోశయ్య సీఎం జయలలితను పరామర్శించేందుకు నేడు చెన్నై రానున్నారు. ఇదిలాఉండగా తమిళనాడుకు కొత్త గవర్నర్‌ను త్వరలోనే ఏర్పాటుచేయాలని కేంద్రం యోచిస్తోంది. ఆగస్టు చివరలో రోశయ్య పదవీ విరమణ చేసినప్పటి నుంచి.. ఆ బాధ్యతలను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.
అపోలో పరిసరాల్లో సెల్‌ఫోన్ల నిఘా
జయలలితకు చికిత్స గురించి అనేక రకాలుగా వదంతులు వ్యాపిస్తుండడంతో.. వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అపోలో ఆస్పత్రి పరిసరాలకు వచ్చే అన్ని సెల్‌ఫోన్ల సంభాషణలపై నిఘా పెట్టారు. ఈ మేరకు ఆస్పత్రిలోనే ఒక కంట్రోల్ రూంను ఏర్పాటుచేసుకున్నారు. జయకు వైద్యం చేసే నర్సుల నుంచి సెల్‌ఫోన్‌లను సేకరించిన తరువాతనే లోనికి అనుమతిస్తున్నారు. నిఘా విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నేతలు తమకు వచ్చే కాల్స్‌ను కట్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, తన ఆధీనంలోని శాఖలను మంత్రి పన్నీర్‌సెల్వంకు అప్పగించాల్సిందిగా ముఖ్యమంత్రి జయలలిత ఎలా సూచించారో గవర్నర్ విద్యాసాగర్‌రావు స్పష్టం చేయాలని పీఎం అధ్యక్షుడు డాక్టర్ రాందాస్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ గురువారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు.
ఆస్పత్రి వద్దే అభిమానుల పడిగాపులు
అమ్మ ఆరోగ్యంపై ఆందోళనతో గురువారం సైతం పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అపోలో ఆస్పత్రి వద్దనే పడిగాపులు కాశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు అపోలో వద్దకు వచ్చి వెళుతున్నారు. మంత్రి వేలుమణి నేతృత్వంలో కోయంబత్తూరు సుగుణాపురం శక్తి మారియమ్మన్ ఆలయంలో 336 రకాల పూలతో మూడు రోజుల పాటూ భారీ ఎత్తున నిర్వహించే మహాయాగం గురువారం ప్రారంభమైంది. గుమ్మిడిపూండి సాయిబాబా ఆలయంలో అన్నాడీఎంకే శ్రేణులు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని 68 దర్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు.
జయ అనారోగ్యానికి గురయ్యారని కలత చెందిన ఇద్దరు అన్నాడీఎంకే కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతితో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపై వదంతులు సృష్టించిన కేసులో మరో ఇద్దరిని చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్, ట్వీట్టర్‌లో వదంతులు రేపిన చెన్నైకి చెందిన బాలసుందరం(42), తూత్తుకూడికి చెందిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగి తిరుమణిసెల్వం(28)లను అదుపులోకి తీసుకున్నారు. వదంతుల ఆరోపణలపై ఈనెల 10న ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.