తిరువొత్తియూరు: నెల్లై తామ్రభరణి నదిలో చేపలు పట్టేందుకు జాలరి విసిరిన వలలో నటరాజస్వామి విగ్రహం చిక్కింది. నెల్లై, మానూర్ సమీపం తెర్కు (సౌత్) సెళియనల్లూరుకు చెందిన గణపతి. ఇతని కుమారుడు కాళిరాజ్ (43) జాలరి. ఇతను రాత్రి సమయంలో మణిమూర్తీశ్వరం ప్రాంతంలో తామ్రభరణి నదిలో చేపలు పడుతుంటాడు.
సోమవారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో ఇతను చేపలు పడుతుండగా వలలో ఒకటిన్నర అడుగుల ఎత్తు కలిగిన నటరాజస్వామి విగ్రహం ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనిపై కాళిరాజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దక్ష నల్లూర్‌పోలీసు ఇన్‌స్పెక్టర్ పెరియస్వామి, సబ్ ఇన్‌స్పెక్టర్ షేక్, పోలీసులు అక్కడికి చేరుకుని నటరాజస్వామి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని నెల్లై తహశీల్దార్ నాథన్ వద్ద అప్పగించారు.