నిన్న ప్రేమ పెళ్లి... నేడు ఆత్మహత్య
వెల్దుర్తి : మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట 24 గంటల్లోపే ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని వెల్దుర్తి మండలం నాగులగుట్ట గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రమేష్, మాధవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రమేష్ స్థానికంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా... మాధవి మేడ్చల్‌లోని ఓ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరి కులాలు వేరు కావడంతో ప్రేమ వ్యవహారంపై కొద్ది రోజుల కిందట గ్రామంలో పంచాయితీ జరిగింది.
వీరిద్దరూ శనివారం వివాహం చేసుకున్నారు. అనూహ్యంగా ఆదివారం ఉదయం గ్రామంలోని చెట్టుకు ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబ పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నవ వధువరుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.