
ప్రేమికురాలి అక్కను వేధించిన యువకుడి అరెస్ట్
మైసూరు:తన ప్రేమకు అడ్డుగా ఉందని కక్ష పెంచుకున్న యువకుడు తన ప్రేమికురాలి అక్క పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను తెరచి అందులో అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేస్తూ ఆమెను వేధిస్తున్న యువకుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు. నగరంలోని జయలక్ష్మిపురలో ఓ ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న ఓ మహిళ తన ఇద్దరు చెల్లెళ్లతో కలసి జయలక్ష్మిపురలో నివాసముంటోంది. అదే ప్రాంతానికి చెందిన యువకుడికి ఆమె చెల్లెలితో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. వారిద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న ఆమె తన చెల్లెల్ని ప్రేమించడం మానుకోవాలని యువకుడిని హెచ్చరించడంతో పాటు తన చెల్లెలిని కూడా వారించింది.
దీంతో తన ప్రేమకు అడ్డు చెప్పిందని కక్ష పెంచుకున్న యువకుడు ఆమె పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తెరచి అందులో ఆమె పనిచేస్తున్న కాలేజీలోని విద్యార్థులకు, ఆమె బంధువులకు, స్నేహితులకు అశ్లీల వీడియోలు షేర్ చేసేవాడు. అదేవిధంగా కొంత మంది బయటి వ్యక్తులను స్నేహితులుగా చేర్చుకొని వారితో అశ్లీల కరంగా చాటింగ్‌లు చేయడంతో పాటు ఆమె ఫోన్ నెంబర్‌ను అందరికి షేర్ చేయడంతో చాలా ఇబ్బందులు పడ్డానని బాధిత మహిళ తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. కాగా నిందితుడి గురించిన వివరాలను వెల్లడిండచానికి పోలీసులు నిరాకరిస్తున్నారు.