సీఎం మరింత పరిణతి ప్రదర్శించాలి
ఎన్సీపీ నేత శరద్‌పవార్ సలహా
ముంబై: ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి తన ప్రవర్తనలో, మాటల్లో మరింత పరిణతిని ప్రదర్శించాల్సి ఉంటుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌నుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పవార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి ఫడ్నవిస్ విపక్షాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు అసంబద్ధంగా, హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడేటప్పుడు తగిన పరిణతిని ప్రదర్శించాల్సి ఉంటుందని సూచించారు. ఫడ్నవిస్ యుక్తవయస్కుడే కాబట్టి మున్ముందు అతడికి పరిపక్వత అలవడుతుందని పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నాకు దేవేంద్ర ఫడ్నవిస్ తండ్రి గంగాధర్ ఫడ్నవిస్‌తో అనుబంధం ఉంది. ఆయన చాలా వ్యక్తిత్వమున్నవాడు..అంతటిస్థాయి వ్యక్తి కుమారుడిగా దేవేంద్ర ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది..’ అని పవార్ అన్నారు.
ప్రత్యేక విదర్భ గురించి ఆలోచించేబదులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికలను రూపొందించేందుకు సీఎం కృషిచేయాలని పవార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలపై విజయ్ కేల్కర్ కమిటీ అందజేసిన నివేదికపై చర్చించేందుకు శీతాకాల సమావేశాలను మరికొంత కాలం పొడిగించి ఉండాల్సిందని పవార్ అభిప్రాయపడ్డారు.
అలాగే ముంబై అభివృద్ధి కోసం ప్రధాని నేతృత్వంలో కమిటీని నియమించాలనే యోచన కూడా సరైనది కాదని పవార్ వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రానికి చెందిన లేదా రెండు ఇరుగుపొరు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలలో ప్రధాని జోక్యం సమర్థనీయం కాదని ఈ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.