పెద్దాయనకు కోపం వచ్చింది!
మరాఠా పెద్దాయన శరద్ పవార్‌కు కోపం వచ్చింది. ఎన్నికల రాజకీయాల్లో తలపండిన కురువృద్ధుడైన ఈయన.. మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఇప్పటికి 50 ఏళ్లు దాటిపోయింది. అలాంటి పెద్దమనిషికి ఇప్పటి పరిణామాలు చూస్తే కోపం రాకుండా ఉంటుందా మరి. పుణెలోని ఎర్రవాడ ప్రాంతంలోగల మోఝే హైస్కూలు మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడారు. బీజేపీ, శివసేన రెండింటినీ ఆయన తిట్టిపోశారు. ఎక్కువగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. బీజేపీలో ఈ మధ్య కొత్తగా చేరుతున్నవాళ్ల అర్హతలు ఏంటా అని చూస్తే.. చాలామంది నేరచరితులేనని తెలుస్తోందని, ఒకళ్లపై 302, మరొకరిపై 376 సెక్షన్ల కింద కేసులుంటే మరికొందరు దోపిడీలు, హత్యాయత్నాల కేసులు ఉన్నవాళ్లని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి కూడా స్వయంగా అలాంటి నేరస్థులకు సాదరస్వాగతం పలకడం చాలా దారుణమని పవార్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనం కావడానికి ముఖ్యమంత్రే కారణమని, అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రానికి హాని కలుగుతుందని చెప్పారు. దాదాపు గంట పాటు సాగిన ప్రసంగంలో మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన రెండింటిపైనా ఆయన దుమ్మెత్తిపోశారు. నేరస్థులను పార్టీలోకి తీసుకురావడానికి బాధ్యత బీజేపీదేనని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారని, మరోవైపు శివసేనలో అంతా దోచుకునేవాళ్లే ఉన్నారంటూ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అంటున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప వాళ్లకు మరేమీ రాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అదికారంలో ఉన్నప్పుడు తమ మధ్య విభేదాలున్నా తమలో తాము పరిష్కరించుకునేవాళ్లం తప్ప ఇలా రోడ్డున పడలేదని గుర్తుచేశారు. తమ పార్టీ వాళ్లు గత పదేళ్లుగా పుణె అభివృద్ధికి చాలా కష్టపడ్డారంటూ చివర్లో తెలిపారు.