అరేబియా సముద్రంలోనే ‘ఛత్రపతి’ స్మారకం!
Published Sat, Aug 10 2013 12:00 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
సాక్షి ముంబై: ఛత్రపతి శివాజీ స్మారకాన్ని అరేబియా మహాసముద్రంలోనే ఏర్పాటుచేసేందుకు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పనులు చేపట్టేందుకు విదేశీ ఆర్కిటెక్ట్‌లు, శిల్పకారులకు ఆహ్వానం పంపింది. ‘రాజ్‌భవన్’ (గవర్నర్ నివాసం) నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఛత్రపతి శివాజీ మహారాజు స్మారకాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై రాష్ట్ర సమాచార శాఖ వెబ్‌సైట్‌లో ఓ ప్రకటనను కూడా విడుదల చేసినట్టు ముంబై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జయంత్ పాటిల్ తెలిపారు. ఆర్కిటెక్టులు, శిల్పకారుల నుంచి అన్ని వివరాలను సేకరించిన అనంతరం ఓ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. దీని కోసం సుమారు తొమ్మిది నుంచి పది నెలల సమయం పట్టవచ్చని మంత్రి చెప్పారు. 2002లో సముద్రతీరంలో అంతర్జాతీయ స్థాయి స్మారకాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. అనేక అవరోధాల అనంతరం ఎట్టకేలకు ఈ స్మారకానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. త్వరలోనే ప్రాథమిక పనులను ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Advertisement
Advertisement