ఒక్కరితో సరి! | Maharashtra ministry expansion today; NCP's Jitendra Awhad to become minister | Sakshi
Sakshi News home page

ఒక్కరితో సరి!

Published Thu, May 29 2014 10:34 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM

Maharashtra ministry expansion today; NCP's Jitendra Awhad to become minister

 సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలలే ఉన్నా ఎన్నికల్లో విజయం కోసం మంత్రివ ర్గ విస్తరణ చేపడుతున్నట్లు హంగామా చేసిన కాంగ్రెస్, ఎన్సీపీల ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఊరించి.. ఉసూరుమనిపించింది. మార్పులు, చేర్పులతో కలిసి కనీసం నలుగురైదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని భావించినా కేవలం ఒక్కరితో మాత్రమే సరి అనిపించారు.

 వైద్యవిద్యాశాఖ మంత్రిగా అవ్హాడ్..
 వైద్యవిద్యాశాఖ మంత్రిగా కల్వా-ముంబ్రా యువ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో గురువారం ఉదయం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ కె.శంకర్‌నారాయణన్, అవ్హాడ్‌తో ప్రమాణ స్వీకారం చేయించి పదవీ బాధ్యతలు అప్పగించారు. నందుర్బార్ జిల్లాకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు విజయ్‌కుమార్ గావిత్ బీజేపీ బాట పట్టడంతో ఆయనను పార్టీలోంచి వెలివేయాల్సి వచ్చింది. దీంతో గావిత్ వద్ద ఉన్న వైద్యవిద్యాశాఖమంత్రి పదవి ఖాళీ కావడంతో దానిని అవ్హాడ్‌కు కట్టబెట్టారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎన్సీపీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు.

 ఫౌజియాఖాన్‌పై వేటు లేనట్లే...
 ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీ కాలం కూడా ముగిసింది. దీంతోపాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆమెకు మరోసారి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు సన్నగిల్లినట్టేనని అంతా భావించారు.

 ఈ పదవిని  విజయ్‌కుమార్ గావిత్ సొంత సోదరుడు శరద్ గావిత్‌కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎలాంటి మార్పులు చేయకూడదని, మంత్రి పదవిలో ఆమెనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

 ఖాళీగానే కాంగ్రెస్ కోటా..
 కాంగ్రెస్ కోటాలోని మూడు పదవులు కూడా భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఈ మూడు స్థానాలను ఎవరితోనూ భర్తీ చేయలేదు. దీంతో కాంగ్రెస్ వాటాలోని మూడు మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని త్వరలో భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉందని ఆ పార్టీ నేతలు కొందరు తెలిపారు. ఈ పదవులను ఆశిస్తున్న నాయకుల్లో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, వసంత్ పుర్వే తదితరులు ఉన్నారు. నాలుగైదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే మంత్రివర్గ విస్తరణ చేపట్టినా కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ద్వారా వారిలో నిరుత్సాహాన్ని నింపినట్లే అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement