స్థానిక ఎన్నికల్లో ఈసారి మహిళలు అధికసంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బుధవారంనాటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా
ఢిల్లీ భవితపై మహిళా ఓటర్ల ముద్ర
Published Thu, Dec 5 2013 12:14 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
న్యూఢిల్లీ: స్థానిక ఎన్నికల్లో ఈసారి మహిళలు అధికసంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బుధవారంనాటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా మహిళలు ఓటు వేశారు. భద్రత లేమి, నిత్యావసరాల పెరుగుదల వంటి సమస్యలతో తల్లడిల్లుతున్న మహిళలు దక్షిణ ఢిల్లీలోని ఆర్.కె.పురం, మాలవీయనగర్, ఛత్తర్‌పూర్, తుగ్లఖాబాద్ వంటి నియోజకవర్గాల్లో అధికసంఖ్యలో ఈసారి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు ఓటును ఆయుధంగా వాడుకున్నారు. ముఖ్యంగా మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న మహిళలు తమ ఓటుతో స్థానిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలమనే ధీమాను వ్యక్తం చేశారు. ఆర్కేపురంలో 800 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటల వరకే మహిళలు 50 శాతానికి పైగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని స్థానిక పోలింగ్ అధికారి సంజయ్ కిషోర్ తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా అభ్యర్థిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఛత్తర్‌పూర్ నియోజకవర్గంలోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఇక్కడ 35 వేల మంది ఓటర్లు ఉండగా ఉదయం 11 గంటల వరకు 4,200 మంది ఓటేసినట్లు ఎన్నికల అధికారి రమేష్ రాజ్‌పుట్ చెప్పాడు. తుగ్లకాబాద్ నియోజకవర్గంలో సుమారు 30 వేల ఓటర్లు ఉన్న ఇందిరా క్యాంప్ మురికివాడల్లో స్థానిక సమస్యలే ఓటర్ల భవితవ్యాన్ని ప్రభావితం చేయనున్నాయి. ‘ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ చాలా అధ్వానం. చాలా తక్కువ మరుగుదొడ్లు ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి మార్పును కోరుతున్నాం. మా సమస్యలు పట్టించుకునేవారినే ఎన్నుకోవాలనుకుంటున్నాం..’ అని 48 ఏళ్ల క్యాంప్ నివాసి లాల్ సింగ్ చెప్పాడు. మాలవీయనగర్‌లో కొత్తపార్టీ హవా కనిపిస్తోంది. ‘ఇక్కడ వాహనాల పార్కింగ్ చాలా పెద్ద సమస్య. రక్షణ, ధరలు, కరెంటుతో పాటు పార్కింగ్ సమస్యను పరిష్కరించే వారికే ఈసారి మా మద్దతు..’ అని అవ్‌నీత్ కౌర్ తెలిపారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఆప్ నాయకుడు కేజ్రీవాల్ పోటీపడుతున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలోనూ మొదటిసారి ఓటుహక్కు పొందిన మహిళా ఓటర్లు అధికసంఖ్యలో ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. అయితే జంగ్‌పురా,బాదర్‌పూర్, సంగం విహార్ వంటి ప్రాంతాల్లో మాత్రం మిహ ళా ఓట్ల శాతం తగ్గిందని చెప్పవచ్చు.
Advertisement
Advertisement