ముంబయి: మాలెగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు ప్రత్యేక మోకా కోర్టులో చుక్కెదురు అయింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. యూఏపీఏ, ఐపీసీ, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద విచారణ కొనసాగుతున్నందున ప్రజ్ఞాసింగ్ కు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని ప్రత్యేక న్యాయమూర్తి ఎన్ఏ టికొలే తెలిపారు. కాగా మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఈ ఏడాది మే నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
కాగా 2008 నాటి ఈ పేలుళ్ల కేసులో ఆమెపైన, మరో ఐదుగురి పైన చేసిన అన్ని అభియోగాల్ని ఎన్‌ఐఏ శుక్రవారం ఉపసంహరించుకుంది. అదే సమయంలో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్‌సహా మరో పదిమందిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్(మోకా) చట్టం కింద చేసిన అభియోగాలను సైతం ఉపసంహరించుకుంది. తమ దర్యాప్తులో ప్రజ్ఞ, మరో ఐదుగురికి వ్యతిరేకంగా ఏవిధమైన సాక్ష్యాలు లభించలేదని ఎన్‌ఐఏ ప్రకటించింది. వారిపై అభియోగాలు కొనసాగించదగినవి కావంటూ అనుబంధ చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. 2008, సెప్టెంబర్ 29న మాలెగావ్‌లో జరిగిన జంట పేలుళ్లలో ఏడుగురు మరణించడం తెలిసిందే. కాగా కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని సాధ్వి కుటుంబ సభ్యులు తెలిపారు.
సాధ్వీ ప్రజ్ఞాసింగ్ కు బెయిల్ తిరస్కరణ
Published Tue, Jun 28 2016 5:41 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM
Advertisement