ఎక్కడుంది మానవత్వం?
► ఆస్తి పంచివ్వలేదని తండ్రిపై దాడి
► సోషల్ మీడియాలో వీడియో
బాగలకోటె: అనుబంధాలన్నీ ఆర్థిక బంధాలే అవుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కనికరం, ఆప్యాయత భూతద్దం పెట్టినా కనిపించడం లేదు. డబ్బు, ఆస్తులు ఇవ్వకపోతే కన్నవారిని సైతం చావబాదుతున్నారు. కన్న తండ్రి ఆస్తిని పంచడం లేదని ఇద్దరు కొడుకులు తండ్రిని తీవ్రంగా కొట్టి లాక్కెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన ఘటన రెండు రోజుల క్రితం బాగలకోటె జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రిని కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాదామి తాలూకాలో ఉన్న నింగాపుర గ్రామంలో శేకçప్ప మనగొళికి 24 ఎకరాల పొలముంది.
దానిని పంచివ్వాలని కుమారులు కనకప్ప, యల్లప్ప చాలాకాలం నుంచి గొడవ పడుతున్నారు. కానీ శేకప్ప ఆస్తి పంచి ఇవ్వడానికి ఒప్పుకోక పోవడంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు కుమారులు కలిసి సోమవారం తండ్రిని కాళ్ళు చేతులు కట్టి వేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. అతన్ని కొంతదూరం ఈడ్చుకుంటు వెళ్లారు. ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విషయం తెలుసుకున్న గుళదెగుడ్డ పోలీసులు కేసు నమోదు చేసుకుని కసాయి కొడుకులను అరెస్ట్ చేశారు.