Karnataka Man Strangles Daughter Over Affair Lover Dies By Suicide - Sakshi
Sakshi News home page

మరో పరువు హత్య.. వేరే కులస్తుడిని ప్రేమించిందని కన్న తండ్రి కర్కశం, మనస్తాపంతో ప్రియుడు సైతం

Published Wed, Jun 28 2023 4:12 PM | Last Updated on Wed, Jun 28 2023 6:08 PM

Karnataka Man Strangles Daughter Over Affair Lover Dies By Suicide - Sakshi

కర్ణాటకలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందనే కోపంతో సొంత కూతురిని హత్య చేశాడు ఓ తండ్రి. అయితే ప్రియురాలి మరణ వార్త తట్టుకోలేక ప్రియుడు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం కోలార్‌ జిల్లాలోని కేజీఎఫ్‌ ప్రాంతంలో వెలుగుచూసింది. 

కేజీఎఫ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి  కీర్తి 24 ఏళ్ల గంగాధర్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో తండ్రి కృష్ణమూర్తి వీరి ప్రేమను నిరాకరిస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో యువతికి ఆమె తండ్రితో అనేకమార్లు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గంగాధర్‌ ప్రేమను మర్చిపోవాలని కృష్ణమూర్తి తన కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె వినలేదు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది.

గొడవ పెద్దదవ్వడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన కృష్ణమూర్తి కూతురిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం కూతురు ఆత్మహత్య చేసుకుందని నమ్మించేలా ఆమె మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కీర్తిది ఆత్మహత్య కాదు హత్య అని తేల్చారు. తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

కాగా ప్రియుడు గంగాధర్‌ మేస్త్రీగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  కీర్తి మృతి విషయం తెలుసుకున్న గంగాధర్‌.. తట్టుకోలేక సమీపంలోని రైలు పట్టాల వద్ద వస్తున్న రైలుకు ఎదురెళ్లి  అక్కడికక్కడే మృతి చెందినట్లు కేజీఎఫ్ పోలీస్ సూపరింటెండెంట్ కె ధరణి దేవి పేర్కొన్నారు.
చదవండి: ఏమైంది శ్రీకృష్ణ... ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కడే వారసుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement