కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘తేజ్’
సాక్షి, బెంగళూరు: మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) కంప్యూటర్ సైన్స్ విద్యార్థి(2008-12 బ్యాచ్) భాస్కర్ ఉపాధ్యాయ తీసిన ‘తేజ్’ షార్ట్ ఫిలిం కేన్స్ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శనకు రానుంది. ఈ ఫిలిం ఇప్పటికే అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అలాగే 69వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘షార్ట్ ఫిల్మ్ కార్నర్’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది.
తనకు మగపిల్లాడు పుడతాడని భావించిన తండ్రి కి ఆడపిల్ల జన్మించడంతో ఆ చిన్నారిని వదిలేస్తాడు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సాగే చిత్రం ‘తేజ్’. భాస్కర్ ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఫిల్మ్ మేకింగ్ వైపు రెండేళ్ల కిందట అడుగులు వేశారు. చిన్ననాటి నుంచి తనకు సినిమాలపై ఆసక్తి ఉండేదని, కంప్యూటర్ సైన్స్ చదివినప్పటికీ తనలో ఉన్న ఆసక్తి తగ్గలేదని వివరించారు. ‘తేజ్’ చిత్రం ఆదివారం కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అవుతుందని వెల్లడించారు.