న్యూఢిల్లీ:లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో దేశ రాజధానిలో అక్రమకట్టడాల కూల్చివేత పునఃప్రారంభమైంది. ఇందులోభాగంగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) 50 భవనాలను తాజాగా నేలమట్టం చేసింది. మరో 300 భవనాల కూల్చివేతకు నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. సదర్‌బజార్ జోన్‌లోనే 30 అక్రమ కట్టడాలను కూల్చివేయడంతోపాటు... ఒక భవనాన్ని సీజ్ చేసినట్టు ఎన్‌ఎండీసీ పీఆర్‌ఓ యోగేంద్ర సిన్హా మన్ తెలిపారు. రోహిణి జోన్‌లో మరో 12 భవనాలను నేలమట్టం చేయడమే కాకుండా మరో భవనాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. సిటీ జోన్‌లో కేవలం ఆరు కట్టడాలనే కూల్చేసినట్టు చెప్పారు. ఎన్నికల నియమావళి, సిబ్బంది కొరత వల్ల కూల్చివేతల్లో ఇంకా జాప్యం జరుగుతోందని, కూల్చివేత ప్రక్రియలో పాల్గొనాల్సిన సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించడంతో సరైన సమయంలో చేయలేకపోతున్నామని ఆయన అన్నారు.
కొన్ని రోజుల కిందట వాజీపూర్ పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన కూల్చివేతలపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. సిటీజోన్‌లోని అజ్మీరీ గేట్, చాందినీచౌక్, దరియాగంజ్, రోహిణి జోన్, పీతమ్‌పుర, పశ్చిమ్‌విహార్, శాలిమార్ బాగ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో నిబంధనలు అతిక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేసినట్టు తెలిపారు. పశ్చిమ్ విహార్‌లోని ఓ స్కూల్‌లో సగభాగాన్ని కూడా సీలింగ్‌లో భాగంగా కూల్చివేశామని ఆయన వివరణ ఇచ్చారు. ద క్షిణఢిల్లీ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లలో ప్రమాదక ర కట్టడాలను పర్యవేక్షించే వర్షాకాలపు సర్వే జూన్ వరకు కొనసాగుతుందని మన్ తెలిపారు. అత్యంత ప్రమాదకర కట్టడాల తొలగింపునకు వెంటనే నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే కూల్చివేతలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కొందరు సిబ్బందిని ప్రతిఘటించడంతో పోలీసుల సాయం తీసుకోవాల్సిన వచ్చిందని సీనియర్ మున్సిపల్ అధికారి ఒకరు అన్నారు.
ప్రమాదకర భవనాల గుర్తింపునకు సర్వే
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమాదకర లేదా శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి కూల్చేయడానికి తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) సర్వే నిర్వహించనుంది. జూన్ 15 నాటికి సర్వే ముగించాలని, దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ , ఫిట్టింగ్ పనులను 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని కార్పొరేషన్ సంబంధిత విభాగాలను ఆదేశించింది. ‘ప్రమాదకర, మరమ్మతులకు అనువుగా ఉన్న భవనాలను గుర్తించడానికి అన్ని ప్రాంతాల్లో తిరిగి సర్వే నిర్వహిస్తాం. అన్ని మున్సిపాలిటీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఉద్యోగుల క్వార్టర్లు, కార్యాలయాల భవనాలను తనిఖీ చేస్తాం. వీటి పైపులను కూడా పరిశీలించి శుభ్రపరుస్తాం. ఫలితంగా వర్షపు నీరు సాఫీగా డ్రైనేజీల్లోకి వెళ్తుంది’ అని కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏదైనా ఇళ్లు మరమ్మతునకు అనువుగా లేదని తేలితే.. దానిని తొందర్లేనే కూల్చివేస్తారు. సర్వేకు సంబంధించి వారం వారీగా నివేదికలు తయారీ చేసి సంబంధిత జోనల్ కార్యాలయాలకూ పంపిస్తారు. సర్వే నిర్వహణ కోసం ప్రతి జోన్‌కూ ఒక వాహనాన్ని, కార్మికులను కేటాయిస్తారు.
‘మరమ్మతులు చేయడానికి ఉపయోగపడే పరికరాలనూ కూడా సంబంధిత విభాగాలకు పంపిస్తాం. దీనివల్ల వర్షాకాలంలోనూ సులువుగా మరమ్మతులు నిర్వహించవచ్చు. పాత ఢిల్లీలో పురాతన భవనాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి భవనాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ప్రమాదకరమని గుర్తిస్తే తక్షణం ఖాళీ చేయాల్సిందిగా భవన యజమానులను ఆదేశిస్తున్నాం.’ అని ఈడీఎంసీ వర్గాలు తెలిపాయి. జూన్ 15 కల్లా అన్ని మురుగుకాల్వల్లో పూడిక తొలగింపును పూర్తి చేయాలని పారిశుధ్య విభాగాన్ని కూడా తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేతకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మరో అధికారి తెలిపారు.
కూల్చివేతలు షురూ
Published Sat, Apr 19 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM
Advertisement
Advertisement