ఎండీఎంకే నేత వైగోకు వ్యతిరేకంగా తిరువారూర్‌లో నిరసన జ్వాల రగిలింది. దుడ్డుకర్రలకు నల్ల జెండాలు చుట్టి డీఎంకే వర్గాలు నిరసనకు దిగారు.
సాక్షి, చెన్నై : ఎండీఎంకే నేత వైగోకు వ్యతిరేకంగా తిరువారూర్‌లో నిరసన జ్వాల రగిలింది. దుడ్డుకర్రలకు నల్ల జెండాలు చుట్టి డీఎంకే వర్గాలు నిరసనకు దిగారు. డీఎంకే వర్గాలు తన మీద దాడికి యత్నించాయన్న వైగో ఆరోపణలతో కరుణానిధి దిష్టిబొమ్మల, చిత్రాలను దగ్ధం చేసే పనిలో ఎండీఎంకే వర్గాలు పడ్డాయి. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత బయలు దేరడంతో వైగోకు భద్రత పెంచారు. ఎండీఎంకే నేత, ప్రజా సంక్షేమ కూటమి కన్వీనర్ వైగో డీఎంకేను టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు సంధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కోవిల్ పట్టి రేసు నుంచి తప్పుకుంటూ ఓ కొత్త ఆరోపణ గుప్పించారు. ఆ నియోజకవర్గంలో కుల ఘర్షణకు డీఎంకే కుట్ర చేసినట్టుగా విరుచుకు పడ్డారు. తదుపరి డీఎంకేకు వ్యతిరేకంగా స్వరాన్ని పెంచారు.
ఈ పరిస్థితుల్లో డీఎంకే అధినేత కరుణానిధి ఎన్నికల బరిలోఉన్న తిరువారూర్‌లో వైగో తీరును అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం రాత్రి మైలాడుతురై నుంచి తిరువారూర్ వైపుగా వస్తున్న వైగోను అడ్డుకునేందుకు డీఎంకే వర్గాలు సిద్ధం అయ్యాయి. వైగో గో బ్యాక్ అంటూ నినదిస్తూ చేతిలో దుడ్డుకర్రలకు నల్ల జెండాలు చుట్టి మరి నిరసన తెలియజేశారు. దీంతో వైగో ఆక్రోశంతో ఊగిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. భద్రత నడుమ తిరువారూర్ బస్టాండ్ వద్దకు చేరుకున్న వైగో తన మీద దాడికి డీఎంకే కుట్ర చేసిందని, వారి నుంచి తప్పించుకు వచ్చేలోపు సమయం పట్టిందని ఆరోపించారు. డీఎంకేలో ఓటమి భయం బయలు దేరిందని, అందుకే తనను టార్గెట్ చేసి ఉన్నారని తీవ్రంగా విరుచుకు పడ్డారు. వైగో ఆవేశ పూరిత ప్రసంగం నేపథ్యంలో అక్కడున్న ఎండీఎంకే వర్గాలు వీరంగం సృష్టించారు.
కరుణానిధి దిష్టిబొమ్మల్ని, చిత్ర పటాల్ని దగ్ధం చేయడంతో డీఎంకే వర్గాలు అడ్డుకునేందుకు పరుగులు తీశారు. డీఎంకే, ఎండీఎంకే వర్గాల మధ్య వివాదం రాజుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. అక్కడి నుంచి వైగో వెళ్లి పోవడంతో ఇరు వర్గాల్ని బుజ్జగించిన పోలీసులు, మరలా ఉద్రిక్తత చోటు చేసుకోకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే, వైగోను టార్గెట్ చేసి దాడులకు డీఎంకే వ్యూహ రచన చేసి ఉన్నదని ప్రజా సంక్షేమ కూటమి వర్గాలు ఆరోపిస్తున్నాయి. డీఎంకే ఓటమి భయంతో తనను అడ్డుకునే యత్నం చేస్తున్నదంటూ ఆదివారం ఉదయం చిదంబరంలో జరిగిన రోడ్ షోలో ఆగ్రహం వ్యక్తం చేసిన వైగో, సహనం కోల్పోయి తన పార్టీకి చెందిన నాయకులపై శివాలెత్తడం గమనార్హం.