రాష్ట్రంలో చెరకు కొనుగోలు ధర...ప్రభుత్వ, చక్కెర కర్మాగారాల యాజమాన్యాల మధ్య చిచ్చు రేపుతోంది. టన్ను చెరకు కొనుగోలు ధరను ప్రభుత్వం తొలుత రూ.2,500గా నిర్ణయించింది.
= రూ.2 వేలకు మించి చెల్లించలేం
= తప్పదంటే.. కర్మాగారాలు మూసేసుకుంటాం
= తేల్చిచెప్పిన చక్కెర ఫ్యాక్టరీల యజమానులు
= నేడు సీఎంతో భేటీ అయ్యే అవకాశం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో చెరకు కొనుగోలు ధర...ప్రభుత్వ, చక్కెర కర్మాగారాల యాజమాన్యాల మధ్య చిచ్చు రేపుతోంది. టన్ను చెరకు కొనుగోలు ధరను ప్రభుత్వం తొలుత రూ.2,500గా నిర్ణయించింది. ఇంత మొత్తం చెల్లించలేమంటూ యాజమాన్యాలు భీష్మించడంతో రూ.వంద తగ్గించింది. ఈ వందతో పాటు ప్రతి టన్నుకూ ప్రోత్సాహకంగా మరో రూ.150 ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయినా రూ.2 వేలకు మించి చెల్లించలేమని యాజమాన్యాలు చేతులెత్తేశాయి. చెల్లించి తీరాలంటే ఫ్యాక్టరీలను మూసుకోవడం మినహా వేరే గత్యంతరం లేదని తేల్చి చెప్పాయి.
సోమవారం నగరంలో చక్కెర ఫ్యాక్టరీల యజమానులు సమావేశమయ్యారు. మంగళవారం నేరుగా ముఖ్యమంత్రిని కలుసుకుని పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను వివరించ దలిచారు. అప్పటికీ ముఖ్యమంత్రి స్పందించకపోతే ఈ నెల ఏడో తేదీ తర్వాత ఎప్పుడైనా ఫ్యాక్టరీలను మూసి వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేజీ చక్కెర ధర రూ.26కు పడిపోయిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది చెరకు ఉత్పత్తి బాగా పెరిగి, లక్ష మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపాయి. ప్రభుత్వం ఆదేశించిన ధరను చెల్లిస్తే టన్నుకు రూ.3 వేలు భరించాల్సి వస్తుందని చెప్పాయి. రవాణా తదితర ఖర్చులకు గాను టన్నుకు రూ.500 చెల్లిస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరను చెల్లిస్తే టన్నుకు ఎంత లేదన్నా రూ.400 నుంచి రూ.600 వరకు నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నాయి.
కత్తికి లేని దురద...
టన్ను చెరకును రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు విక్రయించడానికి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఏక పక్ష నిర్ణయం వల్ల గందరగోళం తలెత్తిందని పలువురు యజమానాలు వ్యాఖ్యానిస్తున్నారు. రూ.2 వేలు చొప్పున తమ ఫ్యాక్టరీకి ఇప్పటికే 18 వేల మంది రైతులు చెరుకును తోలారని బెల్గాం జిల్లాలోని సోమేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ యజమాని బసవరాజ్ బాలేకుందర్గి తెలిపారు. వాస్తవ పరిస్థితులు తెలిసినందునే వారు ఈ ధరకు విక్రయిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఆదేశించిన కొనుగోలు ధరను అమలు చేయాల్సి వస్తే ఉత్తర ప్రదేశ్‌లో లాగా ఇక్కడా ఫ్యాక్టరీలు మూత పడతాయని హెచ్చరించారు. అక్కడ కూడా ఇదే సమస్య ఎదురైందన్నారు. మరో వైపు ప్రభుత్వ కొనుగోలు ధర నిర్ణయంపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడానికి యజమానులు ప్రయత్నిస్తున్నారు.