
విమానాలకు ‘పవర్’ పంచ్!
సాక్షి, చెన్నై: చెన్నై మీనంబాక్కం విమానాశ్రయాన్ని ఇటీవల అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి స్వదేశీ, విదేశీ విమానాలు నిత్యం టేకాఫ్, ల్యాండింగ్ సాగుతున్నాయి. దీంతో ఈ విమానాశ్రయానికి నిత్యం విద్యుత్ సరఫరా ఉంటుంది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఈ విమానాశ్రయంలో తరచూ ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటోంది. ఇందులో అద్దాలు పగలడం, పైకప్పు కూలడం ప్రధానంగా తీసుకోవచ్చు. అయితే, విద్యుత్ దెబ్బ ఈ విమానాశ్రయాన్ని నాలుగు గంటలు స్తంభించేలా చేసింది. రాష్ర్టంలో కోతలకు మంగళం పాడుతున్నట్టుగా గత నెల సీఎం జయలలిత ప్రకటించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు ప్రకటించి, ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి సైతం తెచ్చారు. అయితే, నిరంతర విద్యుత్ సరఫరా ఆచరణలో విఫలమవుతున్నారు. సాంకేతిక సమస్యను చూపుతూ సరఫరాను నిలుపుదల చేస్తున్నారు. ఇదే ప్రభావం ఆదివారం అర్ధరాత్రి చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం మీద పడింది.
పవర్ పంచ్: చెన్నై నుంచి విదేశాలకు రాత్రి వేళల్లో అత్యధికంగా విమానాలు బయలు దేరడం సహజం. స్వదేశీ విమానాల సంఖ్య తక్కువే. ఈ పరిస్థితుల్లో అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఉన్నట్టుండి విద్యుత్ సరఫరా ఆగింది. దీంతో అక్కడి అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరా ఆగడానికి గల కారణాలను అన్వేషించారు. ఈ విమానాశ్రయానికి తాంబరం సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అందాల్సి ఉంది. అయితే, అక్కడి నుంచి వచ్చే విద్యుత్ లైన్లలో సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా గుర్తించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారు. కాసేపటి తర్వాత విద్యుత్ సరఫరా వచ్చినా, లో ఓల్టేజీతో నాలుగు గంటల వరకు తంటాలు పడాల్సి వచ్చింది. ప్రయాణికులను తనిఖీలు చేసే స్కానర్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్రయాణికుల వస్తువులు, సరకుల్ని విమానాల్లోకి తీసుకెళ్లే కన్వెర్ బెల్ట్‌లు పనిచేయలేదు. దీంతో సింగపూర్, సౌదీ అరేబియా, లండన్, కొలంబో, బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లకు వెళ్లాల్సిన విమానాలు ఆగాయి.
తప్పని తిప్పలు : నిర్ణీత సమయానికి విమానాలు బయలుదేరాల్సి ఉండడంతో ముందుగానే మీనంబాక్కం చేరుకున్న విదేశీ ప్రయాణికులు లో-ఓల్టేజీతో తిప్పలు పడాల్సి వచ్చింది. ప్రయాణికులను తనిఖీలు చేయడానికి అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. ఒక్కో ప్రయాణికుడిని, వారి వస్తువులను తనిఖీలు చేయడానికి అరగంట సమయం పట్టడంతో అక్కడి అధికారులు, సిబ్బంది చెమటోడ్చాల్సి వచ్చింది. ఎట్టకేలకు నాలుగున్నర గంటల సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ఏడుకు పైగా విమానాలు ఆలస్యంగా బయలు దేరి వెళ్లాయి. ఈ ప్రభావంతో ఉదయం 8 గంటల వరకు నిర్ణీత సమయాల్లో బయలుదేరాల్సిన విమానాలన్నీ ఆలస్యంగాను టేకాఫ్ అయ్యాయి. బయటి నుంచి రావాల్సిన కొన్ని విమానాలు ల్యాండింగ్ కోసం కొంత సేపు చెన్నై మీదుగా చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. పవర్ పంచ్ దెబ్బ మీనంబాక్కం సిబ్బందికి చమటలు పట్టించగా, భద్రతా సిబ్బంది డేగ కళ్లతో పర్యవేక్షించాల్సి వచ్చింది. ఇక, విదేశీ ప్రయాణికులు ఈ పరిణామంతో విస్తుపోయూరు.