జూన్‌లో మెట్రో పరుగు | metro services start from june | Sakshi
Sakshi News home page

జూన్‌లో మెట్రో పరుగు

Published Mon, May 26 2014 10:34 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

metro services start from june

సాక్షి, ముంబై: మెట్రోరైలు సేవలను ప్రారంభించేందుకు జూన్ ఒకటిన రైల్వే బోర్డు నుంచి అనుమతి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ  పరీక్షలు నెగ్గడంతో ఎమ్మెమ్మార్డీయేకు రైల్వే సేఫ్టీ విభాగం నుంచి ఇటీవల ధ్రువపత్రం కూడా అందింది. దీంతో మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధంగా ఉంది.   కొన్నిరోజులుగా రైల్వే అనుమతి కోసం వేచిచూస్తున్న మెట్రోకు జూన్ ఒకటిన గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశాలుండడంతో అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చార్జీలు ఎలా నిర్ధారించాలనేదానిపై ఇటు ప్రభుత్వం, అటు ఎమ్మెమ్మార్డీయే తుది నిర్ణయానికి రాలేదు.

 ఈ సమస్య పరిష్కరించేందుకు మరోవారం రోజుల సమయం పట్టవచ్చు. అంటే జూన్ 10లోపు మెట్రో రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రావొచ్చని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిచేయడానికి పలు ఆలయాలను నేలమట్టం చేయడం తెలిసిందే. దీనికితోడు నిర్వాసితులకు పరిహారం, స్థలసేకరణ వంటి అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటన్నింటిని చేధించుకుని ఎట్టకేలకు మెట్రోరైలుకు తుది మెరుగులు దిద్ది ప్రారంభానికి సిద్ధం చేశారు. మే ఒకటో తేదీన నిర్వహించిన పరీక్షలు సఫలీకృతం కావడంతో రైల్వే సేఫ్టీ కమిషనర్ ధ్రువపత్రం జారీ చేశారు. రైల్వే బోర్డు నుంచి తుది అనుమతి లభించాల్సి ఉంది.

వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మార్గంలో 11.40 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 12 స్టేషన్లు ఉన్నాయి. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం మెట్రో రైలు 2010లో ప్రారంభం కావాలి. స్థలసేకరణ, పరిహారం చెల్లింపు వంటి సమస్యల కారణంగా తీవ్ర జాప్యం జరిగింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,321 కోట్లకు చేరుకుంది. ఇదిలాఉండగా 2013 మేలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మెట్రోకు పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా 2013 డిసెంబరు వరకు మెట్రోరైళ్ల సేవలు అందుతాయని అంతా భావించారు. అనివార్య కారణాల వల్ల ఏకంగా 11 సార్లు రైలు సేవల ప్రారంభం ఆలస్యమయింది.

 దీంతో ముంబైకర్లు మెట్రోపై ఆశలు వదులుకున్నారు. ఈ ఏడాది మేలో ధ్రువపత్రం జారీ కావడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇవన్నీ ఇలా ఉంటే చార్జీల ఖరారుపై ప్రభుత్వం, ఎమ్మెమ్మార్డీయే మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. కనీస చార్జీలు రూ.9, గరిష్ట చార్జీలు రూ.24గా నిర్ణయించాలని ప్రభుత్వం పట్టుబట్టింది. ఇంత తక్కువ చార్జీలతో సేవలు అందించడం కుదరదని ఎమ్మెమ్మార్డీయే వాదిస్తోంది. కనీస చార్జి రూ.22 గరిష్ట చార్జి రూ.33 వరకు ఉండాలని స్పష్టం చేసింది. మెట్రోరైలు ప్రారంభోత్సవానికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపినా, చార్జీల ఖరారుకు వారం పట్టవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement